కోహ్లి కొట్టాడు... | Virat Kohli, Bhuvneshwar Kumar star in India is 59-run win | Sakshi
Sakshi News home page

కోహ్లి కొట్టాడు...

Aug 12 2019 4:45 AM | Updated on Aug 12 2019 4:54 AM

Virat Kohli, Bhuvneshwar Kumar star in India is 59-run win - Sakshi

అయ్యర్‌, పంత్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: మొదట్లో, చివర్లో తడబడినా... మధ్యలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ, యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, సిక్స్‌) చక్కటి అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... ఓపెనర్లు విఫలమైనా కోహ్లి, అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. వన్డేల్లో కోహ్లి 42వ శతకం సాధించాడు.

విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌ (3/53) రాణించగా, కాట్రెల్, హోల్డర్, చేజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. కడపటి వార్తలు అందేసరికి... వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్‌ 12.5 ఓవర్లలో రెండు వికెట్లకు 55 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 11; ఫోర్‌) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా... ఖలీల్‌ బౌలింగ్‌లో ౖషై హోప్‌ (1) బౌల్డయ్యాడు.  వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద క్రిస్‌ గేల్‌ విండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రియాన్‌ లారా (10,348 పరుగులు) పేరిట ఉన్న రికార్డును గేల్‌ అధిగమించాడు.    

వారే నిలిపారు...
ఓపెనర్‌ ధావన్‌ (2) పరుగుల ప్రయాస కొనసాగడంతో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే అతడు కాట్రెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకున్నా విండీస్‌ రివ్యూ కోరి ఫలితం రాబట్టింది. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 18; 2 ఫోర్లు)... 11వ బంతికి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతా ఇబ్బందిగానే కనిపించాడు. సమన్వయ లోపంతో రెండుసార్లు రనౌటయ్యే ప్రమాదం ఎదుర్కొన్నాడు. ఎక్కువగా స్ట్రయికింగ్‌ తీసుకున్న కోహ్లి తనదైన శైలిలో సాధికారికంగా ఆడాడు. చకచకా అర్ధసెంచరీ (57 బంతుల్లో) అందుకున్నాడు.

ఈ దశలో చేజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. వీరి మధ్య రెండో వికెట్‌కు 74 పరుగులు జతకూడితే ఇందులో విరాట్‌వే 50 ఉండటం గమనార్హం. నాలుగో స్థానంలో పంత్‌ (35 బంతుల్లో 20; 2 ఫోర్లు) ప్రయోగం ఈసారీ విఫలమైంది. శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి బౌలర్లు వేసిన బంతులకు పంత్‌ ఇబ్బంది పడ్డాడు. బ్రాత్‌వైట్‌ స్లో డెలివరీని ఫైన్‌ లెగ్‌లోకి స్కూప్‌ చేసే యత్నంలో బౌల్డయ్యాడు. అప్పటికి స్కోరు 22.2 ఓవర్లలో 101/3. మరో వికెట్‌ పడకుండా చూసుకుంటూ కోహ్లి, అయ్యర్‌ స్వేచ్ఛగా ఆడారు. శ్రేయస్‌ సింగిల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ వీలుచూసుకుని బౌండరీలు బాదాడు. మొదటి నుంచి అతడి స్ట్రయిక్‌ రేట్‌ 100పైనే నిలిచింది. హోల్డర్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో కోహ్లి సెంచరీ (112 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.

ఆ వెంటనే అయ్యర్‌ అర్ధశతకం (49 బంతుల్లో) అందుకున్నాడు. థామస్‌ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది స్కోరు పెంచే యత్నం చేసిన కోహ్లి  అదే ఊపులో బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టబోయి వెనుదిరిగాడు. కోహ్లి–అయ్యర్‌ నాలుగో వికెట్‌కు 115 బంతుల్లోనే 125 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్‌ 42.2వ ఓవర్‌ వద్ద ఉండగా వర్షం 25 నిమిషాలు ఆటంకం కలిగించింది. తిరిగి ప్రారంభమయ్యాక రోచ్‌ ఓవర్లో చక్కటి సిక్స్‌ కొట్టిన అయ్యర్‌ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ, అతడిని హోల్డర్‌ పెవిలియన్‌ చేర్చాడు. జాదవ్‌ (16), భువనేశ్వర్‌ (1) విఫలమైనా జడేజా (16 నాటౌట్‌) కాసిన్ని పరుగులు జోడించాడు.

కోహ్లి శతక నిరీక్షణ తీరింది...
ప్రపంచ కప్‌ నుంచి సాగుతున్న కోహ్లి సెంచరీల నిరీక్షణకు తెరపడింది. కప్‌లో 9 మ్యాచ్‌ల్లోనూ సెంచరీ చేయలేకపోయిన విరాట్‌ విండీస్‌పై రెండో వన్డేలో అవకాశాన్ని వదల్లేదు. మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి శతకం (123) బాదాడు. ఆ సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు, తర్వాత ప్రపంచ కప్‌లో 9 మొత్తం 11 మ్యాచ్‌ల్లోనూ సెంచరీ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అతడు వరుసగా 18 మ్యాచ్‌ల్లో శతకం అందుకోలేకపోయాడు. ఓవ రాల్‌గా వెస్టిండీస్‌పై అతడికిది 8వ సెంచరీ. ఆసీస్, శ్రీలంకపైనా ఎనిమిదేసి సెంచరీలు చేశాడు.

నాలుగులో అయ్యర్‌ కాదు.. పంత్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మళ్లీ చర్చనీయాంశమైంది. నాలుగో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మన్‌ కోసం ఎదురుచూస్తూ, అందుకే అన్నట్లుగా ఎంపిక చేసిన అయ్యర్‌ను కాదని పంత్‌ను ముందుగా పంపారు. రోహిత్‌ ఔటైన ఆ సమయానికి ఇంకా 34.3 ఓవర్లున్నాయి. కెప్టెన్‌ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు, నాణ్యమైన నంబర్‌–4 బ్యాట్స్‌మన్‌ దిగేందుకు ఇది అనువైన పరిస్థితి. భారత్‌ భవిష్యత్‌ అవసరాలరీత్యా చూసినా శ్రేయస్‌నే దింపాలి. కానీ, ఊహించని విధంగా పంత్‌ వచ్చాడు. వస్తూనే రెండు ఫోర్లు కొట్టిన రిషభ్‌ ఆ తర్వాత జోరు చూపలేకపోయాడు. అతడు ఎదుర్కొన్న చివరి 14 బంతుల్లో 12 బంతులకు పరుగే రాలేదు. అయ్యర్,పంత్‌ బ్యాటింగ్‌ చేసిన తీరును పోల్చి చూసినా నంబర్‌–4లో ఎవరు సరైనవారో తెలిసిపోతుంది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: శిఖర్‌ ధావన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కాట్రెల్‌ 2; రోహిత్‌ శర్మ (సి) పూరన్‌ (బి) చేజ్‌ 18; విరాట్‌ కోహ్లి (సి) రోచ్‌ (బి) బ్రాత్‌వైట్‌ 120; రిషభ్‌ పంత్‌ (బి) బ్రాత్‌వైట్‌ 20; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) హోల్డర్‌ 71; కేదార్‌ జాదవ్‌ (రనౌట్‌) 16; జడేజా (నాటౌట్‌) 16; భువనేశ్వర్‌ (సి) రోచ్‌ (బి) బ్రాత్‌వైట్‌ 1; షమీ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 279.

వికెట్ల పతనం: 1–2, 2–76, 3–101, 4–226, 5–250, 6–258, 7–262.

బౌలింగ్‌: కాట్రెల్‌ 10–0–49–1, రోచ్‌ 7–0–54–0, హోల్డర్‌ 9–0–53–1, థామస్‌ 4–0–32–0, చేజ్‌ 10–1–37–1, బ్రాత్‌వైట్‌ 10–0–53–3.  

► 120 పరుగులు
► 14ఫోర్లు
► 1సిక్స్‌


గంగూలీని దాటిన కోహ్లి...
కోహ్లి అరుదైన రికార్డుకు రెండో వన్డే వేదికైంది. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (311 మ్యాచ్‌ల్లో 11,363)ని అధిగమించి అతడు రెండో స్థానానికి చేరాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ (463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు) టాప్‌లో ఉన్నాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఆగస్టులో శ్రీలంకపై తొలి వన్డే ఆడిన కోహ్లి... ఇప్పటివరకు 238 మ్యాచ్‌లు, 229 ఇన్నింగ్స్‌ల్లో 11,406 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అతను ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement