తొలి భారత బాక్సర్‌గా...

Vikas Krishan makes history at Strandja Memorial Tournament - Sakshi

సోఫియా(బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లోభారత బాక్సర్‌ వికాస్‌ క్రిషన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత బెస్ట్‌ బాక్సర్‌ అవార్డును వికాస్‌ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో బెస్ట్‌ బాక్సర్‌ అవార్డును గెలుచుకున్న మొదటి భారత బాక్సర్‌గా వికాస్‌ నిలిచాడు.  సోఫియా వేదికగా 75 కేజీల మిడిల్‌ వెయిట్‌ విభాగంలో జరిగిన తుది పోరులో వికాస్‌ విజయ సాధించి పసిడిని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ బాక్సర్‌ అవార్డును సైతం సొంతం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

ఫైనల్‌ పోరులో వరల్డ్‌ చాంపియన్స్‌ కాంస్య పతక విజేత ట్రో ఇస్లే(అమెరికా)పై గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలితంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి పతకాన్ని అందుకున్నాడు. మరొకవైపు మరో భారత బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ కూడా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 49 కేజీల విభాగంలో అమిత్‌ స్వర్ణాన్ని సాధించాడు. ఇక మహిళల తుది పోరులో మేరీకోమ్‌ రజతంతో సరిపెట్టుకుంది. దాంతో ఇక్కడ వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని సాధించాలనుకున్న మేరీకోమ్‌కు నిరాశే ఎదురైంది. 48 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన సెవదా అసెనోవా చేతిలో మేరీకోమ్‌ ఓటమి పాలై రజత పతకానికే పరిమితమయ్యారు.   స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు 11 పతకాలతో పోరును ముగించింది. ఇందులో ఐదు పతకాలు పురుషులు సాధించగా, ఆరు పతకాల్ని మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక్కడ రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఆరు కాంస‍్య పతకాలు భారత్‌ ఖాతాలో చేరడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top