
హైదరాబాద్: హెచ్‌సీఏ కార్యదర్శిగా ఉన్న శేష్ నారాయణ్‌ను చట్టవిరుద్ధంగా ఆ పదవి నుంచి తప్పించారని... అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, హెచ్‌సీఏ సభ్యుడు వి.హనుమంతరావు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేకానంద్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్వసభ్య సమావేశం పూర్తి కాకుండానే లోధా కమిటీ ప్రతిపాదనలకు హెచ్‌సీఏ ఆమోద ముద్ర వేసిందంటూ క్రికెట్ అభిమానులను వివేక్ మోసగించారని వీహెచ్ ఆరోపించారు.
హెచ్‌సీఏ సమావేశంలో సభ్యుల హాజరుకు సంబంధించి కూడా లోధా కమిటీకి తప్పుడు లేఖలు సమర్పించారని ఆయన విమర్శించారు. వివేక్ అధ్యక్ష హోదాలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అదేశాలను, తాము ఇచ్చిన రికార్డులను, ఫిర్యాదులను పరిశీలించి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.