177 పరుగులతో వరల్డ్‌కప్‌ సాధ్యమేనా?

Under 19 World Cup: India Collapse At 177 Runs Against Bangladesh - Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో భారత యువ జట్టు 177 పరుగులకే ఆలౌటైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, తిలక్‌ వర్మ(38) ఫర్వాలేదనిపించాడు. అటు తర్వాత ధ్రువ్‌ జురేల్‌(22) మోస్తరుగా ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. ఈ ముగ్గురు మినహా మిగతా వారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను జైస్వాల్‌, సక్సేనాలు ఆరంభించారు. అయితే 17 బంతులు ఆడిన సక్సేనా రెండు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. ఆపై తిలక్‌ వర్మతో కలిసి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.

కాగా, తిలక్‌ వర్మ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత జైస్వాల్‌కు సరైన సహకారం లభించలేదు. కెప్టెన్‌ ప్రియాంగార్గ్‌(7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఇక జైస్వాల్‌ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత ఏ ఒక్కరూ పెద్దగా ప్రభావం చూపలేదు. జోరెల్‌ ఆడుతున్నాడనుకునే సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. జోరెల్‌ ఔటైన తర్వాత భారత్‌ ఆటగాళ్లు క్రీజ్‌లోకి వచ్చామన్న పేరుకే వచ్చి పెవిలియన్‌ బాటపట్టారు. దాంతో భారత్‌ జట్టు 47.2 ఓవర్లలోనే ఆలౌటైంది. 21 పరగుల వ్యవధిలో భారత్‌ ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో అవిషేక్‌ దాస్‌ మూడు వికెట్లు సాధించగా,షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రకిబుల్‌ హసన్‌కు వికెట్‌ దక్కింది. ఇద్దరు రనౌట్‌ రూపంలో వెనుదిరగడంతో భారత్‌ రెండొందల మార్కును కూడా చేరలేకపోయింది. మరి 178 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని వరల్డ్‌కప్‌ సాధించడం భారత్‌కు కష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప భారత్‌ టైటిల్‌ను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top