‘అంపైర్లూ.. టైమ్‌ చూడండి’ | Sakshi
Sakshi News home page

‘అంపైర్లూ.. టైమ్‌ చూడండి’

Published Fri, Apr 5 2019 4:48 PM

Umpires must see that matches end before 12 AM, Kaif - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో ముగియకపోవడంపై మాజీ క్రికెటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అంపైర్లు సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ విన‍్నవించాడు. ‘ఐపీఎల్‌ మ్యాచ్‌లు ముగుస్తున్న సమయాన్ని అంపైర్లు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దాదాపు ప్రతీ మ్యాచ్‌ అర్ధరాత్రి గం.12.00లకు ముగుస్తుంది. ఆయా జట్లు ఫీల్డింగ్‌ సర్దుబాటు చేసుకునే క్రమంలో మ్యాచ్‌లు ఆలస్యమవుతున్నాయి. ఏ ఫీల్డర్‌ని ఎక్కడ పెట్టాలనే సందిగ్థంలో సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనిపై అంపైర్లు దృష్టి నిలపాలి. నిర్ణీత సమయానికి మ్యాచ్‌లు ముగిసే విధంగా చర్యలు తీసుకోండి’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.

ఇప్పటికే ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కొన్ని జట్లు అనుసరిస్తున్న ఫీల్డింగ్‌ వ్యూహాలను కైఫ్‌ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో మందకొడిగా ఫీల్డింగ్‌ చేసేవారు ఎవరైనా ఉంటే వారి స్థానాల్లో కావాలని చురుకైన ఫీల్డర్లను తీసుకొస్తున్నారని... తగిన కారణం లేకుండా సబ్‌స్టిట్యూట్‌లను వాడుకోవడం సరైంది కాదని కైఫ్‌ వ్యాఖ్యానించాడు.
(ఇక్కడ చదవండి: ఇదేం పద్ధతి? )


 

Advertisement
Advertisement