భారత షూటర్లకు రెండు స్వర్ణాలు | Sakshi
Sakshi News home page

భారత షూటర్లకు రెండు స్వర్ణాలు

Published Thu, Nov 2 2017 12:44 AM

Two golden Indian shooters - Sakshi

బ్రిస్బేన్‌: తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటూ భారత షూటర్లు కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. పోటీల రెండో రోజు భారత్‌ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. అందుబాటులో ఉన్న మూడు పతకాలను భారత షూటర్లు షాజర్‌ రిజ్వీ, ఓంకార్‌ సింగ్, జీతూ రాయ్‌ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో షాజర్‌ రిజ్వీ 240.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా... 236 పాయింట్లతో ఓంకార్‌ సింగ్‌ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్‌ కాంస్యం సంపాదించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో పూజా ఘాట్కర్‌ స్వర్ణం, అంజుమ్‌ మౌద్గిల్‌ రజతం గెలిచారు.

పూజా 249.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... అంజుమ్‌ 248.7 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. పురుషుల స్కీట్‌ ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌లో మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్, అంగద్‌వీర్‌ సింగ్‌ బాజ్వా, షీరాజ్‌ షేక్‌ 119 పాయింట్లు చొప్పున స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. పోటీల తొలి రోజు హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌) స్వర్ణం... దీపక్‌ కుమార్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌) రజతం గెలిచారు.

Advertisement
Advertisement