టి20 పోరుకు హైదరాబాద్‌ రెడీ!

Tomorrow India and Australia match

రేపు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌

నగరానికి చేరుకున్న ఆటగాళ్లు   

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన క్లైమాక్స్‌కు చేరుకుంది. వన్డే సిరీస్‌ను భారత్‌ గెలుచుకున్న తర్వాత ఇప్పుడు టి20 సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ సిరీస్‌ విజేతను తేల్చనుంది. శుక్రవారం ఉప్పల్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి టూర్‌కు చక్కటి ముగింపు ఇవ్వాలని ఆసీస్‌ భావిస్తుండగా... మరో పొరపాటుకు అవకాశం ఇవ్వరాదని భారత్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బుధవారం రాత్రి గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది. గువాహటిలో ఆసీస్‌ టీమ్‌ బస్సుపై రాయి విసిరిన ఘటన వల్ల హైదరాబాద్‌లోనూ భద్రతను మరింత పటిష్టం చేశారు. 2008 నుంచి రాజీవ్‌గాంధీ స్టేడియంలో పెద్ద సంఖ్యలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు నగర అభిమానులకు వినోదాన్ని పంచాయి. అయితే టి20 ఫార్మాట్‌లో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడంతో భారత్, ఆసీస్‌ మ్యాచ్‌పై అమితాసక్తి నెలకొంది. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, మ్యాచ్‌కు సంబంధించి దాదాపు టికెట్లన్నీ అయిపోయాయి. ఆన్‌లైన్‌లోనూ, అటు హెచ్‌సీఏ కౌంటర్ల వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ టికెట్లు కొన్నారు. మంగళవారం రాత్రి వరకు కేవలం రూ. 5 వేలు, రూ. 7,500, రూ. 12,500 విలువ గల కొన్ని టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మ్యాచ్‌ ముందు రోజు అవి కూడా అమ్ముడుపోవచ్చని హెచ్‌సీఏ వర్గాలు వెల్లడించాయి. ఈ మైదానంలో జరిగిన ఐదు వన్డేల్లో భారత్‌ 2 గెలిచి, 3 ఓడింది. 4 టెస్టుల్లో 3 గెలవగా, ఒకటి ‘డ్రా’గా ముగిసింది.  

 టి20 మ్యాచ్‌కు సంబంధించి అందరికి ఉన్న ఏకైక ఆందోళన వర్షం! నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు... ముఖ్యంగా సాయంత్రం నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా వాన పడుతుండటం మ్యాచ్‌పై సందేహాలు రేకెత్తిస్తోంది. బుధవారం పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఏదో ఒక దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. వానల వల్ల మైదానంలోని పిచ్‌ను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడానికి ఇప్పటికే హెచ్‌సీఏ గ్రౌండ్స్‌మన్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం మాత్రం వాన రావద్దని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top