మైదానం చిత్తడి..టికెట్‌ డబ్బులు వాపస్‌! | Sakshi
Sakshi News home page

మైదానం చిత్తడి..టికెట్‌ డబ్బులు వాపస్‌!

Published Sat, Oct 14 2017 12:32 AM

India and Australia cancel the third T20 match

అభిమానుల ఆనందం ఆవిరైంది. చిత్తడిగా మారిన మైదానం ముందు వారి ఉత్సాహం చిత్తయింది. మ్యాచ్‌ రోజున వర్షం పడకుంటే చాలని అంతా కోరుకున్నారు. వరుణ దేవుడు ఒక్కరోజు కరుణిస్తే చాలని సగటు అభిమాని మొక్కుకున్నాడు. రోజంతా, మ్యాచ్‌ సమయంలో కూడా వాన కురవలేదు కానీ కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలు ఆటకు ప్రతికూ లంగా మారాయి. అవుట్‌ఫీల్డ్‌లో అడుగు వేయలేని విధంగా చేశాయి. ఫలితంగా భారత్, ఆస్ట్రేలియా మూడో టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చాల్సిన ధనాధన్‌ మ్యాచ్‌ పేలని చిచ్చుబుడ్డిలా ఆరిపోయింది.

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు నిరాశాజనక ముగింపు లభించింది. టి20 సిరీస్‌ విజేతను తేల్చాల్సిన మ్యాచ్‌లో అసలు ఫలితమే రాలేదు. శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగాల్సిన మూడో టి20 రద్దయింది. టాస్‌ కూడా వేయకుండానే ఆటగాళ్లు స్టేడియం నుంచి వెనుదిరిగారు. మైదానం చిత్తడిగా ఉండి ఆటకు అనుకూలంగా లేకపోవడమే దీనికి కారణం. సాయంత్రం 6.30 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా, అది ఆలస్యం కావడంతో అప్పటికే మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. రాత్రి 7.00 గంటలకు, ఆ తర్వాత 7.45కు మరోసారి గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు... చివరకు 8.15కు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.   రెండో టి20 అనంతరం గువాహటిలో ఆసీస్‌ బస్సుపై దురభిమానుల రాళ్ల దాడి జరిగిన నేపథ్యం లో... శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో రెండు జట్లను ముందు హోటల్‌కు పంపించిన తర్వాతే మ్యాచ్‌ రద్దయిన విషయాన్ని మైదానంలో ప్రకటించారు. నిజానికి మ్యాచ్‌కు ముందు గానీ, నిర్ధారిత సమయంలో గానీ నిజానికి అసలు వర్షమే కురవలేదు. కానీ కొద్ది రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రౌండ్‌లోకి ఇంకిన నీరు వల్ల మ్యాచ్‌కు సిద్ధం చేయడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ పూర్తిగా రద్దు కావడం ఇదే తొలిసారి. తాజా ఫలితంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ 1–1తో ముగిసింది. అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 4–1తో  గెలుచుకుంది.

టికెట్‌ డబ్బులు వాపస్‌...
టి20 మ్యాచ్‌ రద్దు కావడంతో టికెట్లు కొన్నవారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది. త్వరలోనే తేదీ వివరాలు వెల్లడిస్తామని, టికెట్లను జాగ్రత్త చేసుకోవాలని కోరింది.

ఇక ఫుట్‌బాల్‌ ఆడదామా...
ఆసీస్‌తో సిరీస్‌ ముగిసింది. న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్లు ముంబైలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌తో సేదతీరనున్నారు. సెలబ్రిటీ క్లాసికో–2017 పేరుతో రేపు (ఆదివారం) ఈ మ్యాచ్‌ జరగనుంది. విరాట్‌ కోహ్లి నాయకత్వంలో ఆల్‌ హార్ట్‌ ఫుట్‌బాల్‌ క్లబ్, అభిషేక్‌ బచ్చన్‌ కెప్టెన్‌గా ఉన్న ఆల్‌ స్టార్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మధ్య ఈ మ్యాచ్‌ జరుగుతుంది. కోహ్లి జట్టులో ధోనితో పాటు ఇతర భారత క్రికెటర్లు, హాకీ కెప్టెన్‌ శ్రీజేశ్, జాంటీ రోడ్స్‌ కూడా ఉన్నారు. బాలీవుడ్‌ టీమ్‌లో రణ్‌బీర్‌ కపూర్, అర్జున్‌ కపూర్‌ తదితరులతో పాటు ఐపీఎల్‌లో నిషేధానికి గురైన రాజస్థాన్‌ రాయల్స్‌ యజమాని రాజ్‌ కుంద్రా కూడా ఉన్నాడు.

హెచ్‌సీఏ వైఫల్యం...
టి20 మ్యాచ్‌ సన్నాహాలు ప్రారంభమైన దగ్గరి నుంచి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధికారులు పదే పదే ఒకటే మాట చెబుతూ వచ్చారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా... మ్యాచ్‌ నిర్వహణలో మాత్రం తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదని, అన్ని అస్త్ర శస్త్రాలతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సూపర్‌ సాపర్లు, డ్రైనేజీ వ్యవస్థ అద్భుతమంటూ గట్టిగా చెప్పారు. కానీ చివరకు అసలు సమయంలో చేతులెత్తేశారు. ఎంత సేపూ వాన పడితే ఏం చేయాలనే దాని గురించే తప్ప ఇన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మైదానంలో ఇప్పటికే ఉన్న వాస్తవ పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారు. పిచ్‌ను సంరక్షించడంలో సఫలమైనా... అవుట్‌ఫీల్డ్‌ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. నేలలో చాలా నీరు ఉండిపోవడం వల్ల గ్రౌండంతా కప్పి ఉంచిన కవర్ల వల్ల కూడా లాభం లేకపోయింది. ఈ విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం సమస్యగా మారింది. దీనికి సంబంధించి ఉప్పల్‌ స్టేడియంలో ఎలాంటి ఆధునిక తరహా ఏర్పాట్లు లేవు. గురువారం ఫ్యాన్లతో గ్రౌండ్‌ను ఆరబెట్టే ప్రయత్నం చేయడం కూడా కంటితుడుపులాంటిదే. మ్యాచ్‌ రద్దు కావడానికి ప్రధాన కారణం అవుట్‌ఫీల్డ్‌లో కనీసం నాలుగు చోట్ల ఏ మాత్రం ఆటకు వీలు లేని పరిస్థితి కనిపించింది.  ఇక్కడంతా బురదమయంగా మారింది. అక్కడ మట్టిని చదును చేసి రంపపు పొట్టుతో మామూలుగా మార్చేందుకు గ్రౌండ్స్‌మెన్‌ తీవ్రంగా ప్రయత్నం చేసినా అది శక్తికి మించిన పనే అయింది. మొత్తంగా అలాంటి స్థితిలో ఆడితే తమకు ప్రమాదకరమని ఆటగాళ్లు భావించారు.

దాంతో రద్దు చేయక తప్పలేదు. దాదాపు రెండేళ్ల క్రితం ఈడెన్‌ గార్డెన్స్‌లో కూడా సరిగ్గా ఇదే తరహాలో మ్యాచ్‌ రద్దయింది. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పడు వరుసగా ఎన్ని రోజులు వాన పడినా మ్యాచ్‌కు మైదానం సిద్ధం చేసే వనరులు ఆ స్టేడియానికి ఉన్నాయి. ఇకపై హెచ్‌సీఏ కూడా అలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.   నిజానికి వర్షం పడి మ్యాచ్‌ రద్దయినా అభిమాని ఇంతగా బాధపడేవాడు కాదేమో. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే స్టేడియంలోకి చేరుకొని ఎప్పడెప్పుడు తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూద్దామని వారంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇరు జట్ల క్రికెటర్లు గ్రౌండ్‌లో సరదాగా ఫుట్‌బాల్‌ ఆడినా, కొందరు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసినా, కోహ్లి ఎడమ చేత్తో బ్యాటింగ్‌ చేసినా అభిమానుల్లో అమితోత్సాహం కనిపించింది. వారంతా మ్యాచ్‌ రద్దును ఏమాత్రం ఊహించలేకపోయారు. వర్షం ఎలాగూ రావడం లేదు కదా... కాస్త ఆలస్యంగానో, లేదా ఓవర్లు కుదించో మ్యాచ్‌ జరుగుతుందని నమ్మారు. అయితే భారీస్క్రీన్‌పై రద్దు అని కనిపించగానే వారంతా తీవ్ర నిరాశకులోనై స్టేడియం వీడారు.

Advertisement
Advertisement