శ్రీలంక తేలిపోవడంతో టీమిండియా లాంఛనాన్ని పూర్తి చేసింది.
శ్రీలంక తేలిపోవడంతో టీమిండియా లాంఛనాన్ని పూర్తి చేసింది. భారత క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది. 1968లో న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు టెస్టులు గెలిచింది. అయితే అది నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో కివీస్ ఓ మ్యాచ్‌లో నెగ్గింది. లంక తొలి ఇన్నింగ్స్‌ను కుల్దీప్ యాదవ్ దెబ్బతీస్తే... రెండో ఇన్నింగ్స్ అశ్విన్ మాయాజాలానికి కుప్పకూలింది. అతనికి సీమర్ మొహమ్మద్ షమీ అండ లభించింది. లంక బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. పేలవమైన ప్రదర్శననే కొనసాగించారు. ఒక్క కరుణరత్నే మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ టెస్టుకు సరిపోయే ఇన్నింగ్సే ఆడలేదు. కెప్టెన్ దినేశ్ చండిమాల్, మాజీ సారథి మాథ్యూస్ కాసేపు క్రీజులో నిలబడినా... అదేమంత చెప్పుకోదగ్గ స్కోరే కాదు.
అయితే ఈ సిరీస్ మొత్తం శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారాల బ్యాటింగ్... షమీ, అశ్విన్, జడేజాల బౌలింగ్ కోసం గుర్తు పెట్టుకోవాలి. కొత్త కుర్రాళ్లు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు అవకాశమిస్తే మేం నిరూపించుకోగలమని చేతల్లో చూపె ట్టారు. భవిష్యత్ భారత క్రికెట్‌కు కొండంత భరోసా కూడా ఇచ్చారు. విదేశీ గడ్డపై ఆట మరీ ఇంత సులభం కాకపోయిన భవిష్యత్‌లో మరిన్ని గట్టి సవాళ్లు ఎదురవుతాయి. అయితే వరుస విజయాల ఉత్సాహంతో తదుపరి సిరీస్‌లను సానుకూల దృక్పథంతో ఆరంభించవచ్చు. జట్టు ఇన్నింగ్స్‌లను నిర్మించడంతోనే ఆటగాళ్ల సత్తా బయటపడుతుంది. ఓవరాల్‌గా కెప్టెన్ కోహ్లి, ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనే కనబరిచారు. ఇలాంటి ఓపెనర్లు, కొత్త బంతిని పంచుకునే బౌలర్లతో సెలక్టర్లకు ఇబ్బందే! చక్కని ఆటతీరు కనబరిస్తే... ఎవరిని ఉంచాలి? ఎవరిని తొలగించాలనే తలనొప్పులు సెలక్టర్లకు తప్పవు.
సునీల్ గావస్కర్