Sakshi News home page

భారత్‌కు వరుసగా నాలుగో ఓటమి

Published Thu, Oct 8 2015 11:48 PM

The road ahead for the Indian National football team

 అస్గబాట్ (తుర్క్‌మెనిస్తాన్): వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన భారత ఫుట్‌బాల్ జట్టు.... 2018 ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో నిరాశజనక ప్రదర్శనతో మూల్యం చెల్లించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో తుర్క్‌మెనిస్తాన్ చేతిలో ఓడి... గ్రూప్-డిలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. తాజా ఓటమితో కనీసం ఆసియా కప్‌కు అర్హత సాధించే అవకాశాలను కూడా కోల్పోయింది. తుర్క్‌మెనిస్తాన్ తరఫున గుబాంచ్ అబ్లోవ్ (8వ ని.), అమనోవ్ (60వ ని.)లు గోల్స్ సాధించగా, జీజీ లాల్‌పెక్లాహ్ (28వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందించాడు.
 
 ఐఎస్‌ఎల్ కారణంగా ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగిన భారత్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. 6వ నిమిషంలో ఫ్రాన్సిస్ ఫెర్నాండేజ్ కొట్టిన బంతి గోల్ పోస్ట్ పైనుంచి వెళ్లిపోయింది. తర్వాత రెండు నిమిషాల్లోనే తుర్క్‌మెనిస్తాన్ గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 28వ నిమిషంలో తుర్క్‌మెనిస్తాన్ గోల్ కీపర్ అప్రమత్తంగా వ్యవహరించినా... అక్కడే కాచుకున్న జీజీ అద్భుతమైన ఓవర్‌హెడ్ షాట్‌తో స్కోరును సమం చేశాడు.
 
  ఇక రెండో అర్ధభాగంలో భారత్ దూకుడును పెంచినా.. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. అయితే అనుభవం లేని భారత్ డిఫెన్స్‌పై పదేపదే దాడులు చేసిన తుర్క్‌మెనిస్తాన్ మరో గోల్‌తో అధిక్యంలోకి వెళ్లింది. తర్వాత జీజీ మరో బలమైన హెడర్‌ను సంధించినా ప్రత్యర్థి గోల్‌కీపర్ నేర్పుగా పట్టేశాడు. ఇక 86వ నిమిషంలో అద్భుతమైన అవకాశాన్ని రాబిన్ సింగ్ వృథా చేశాడు. సింగ్‌కు అడ్డుగా కేవలం గోల్ కీపర్ మాత్రమే ఉన్నా అతని తప్పించలేకపోయాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement