
అంతా బుద్ధిగా ఉన్నారు!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా భారత క్రికెటర్ల ప్రవర్తన అన్ని రకాలుగా బాగుందని, అసలు మేనేజ్‌మెంట్ వైపునుంచి కనీస హెచ్చరిక చేయాల్సిన అవసరం కూడా....
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా భారత క్రికెటర్ల ప్రవర్తన అన్ని రకాలుగా బాగుందని, అసలు మేనేజ్‌మెంట్ వైపునుంచి కనీస హెచ్చరిక చేయాల్సిన అవసరం కూడా రాలేదని అర్షద్ అయూబ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అయూబ్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం పర్యటన అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. విశేషాలు అయూబ్ మాటల్లోనే...
ఆట చాలా బాగుంది: ఏ టూర్‌లో అయినా ఫలితాలు అనుకూలంగా ఉంటేనే అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. అలా చూస్తే మన జట్టు బాగా ఆడింది కాబట్టి మేనేజర్‌గా నాకు చాలా సంతృప్తి దక్కింది. కొన్ని సార్లు మనకే విజయావకాశాలు వచ్చాయి కూడా. ముఖ్యంగా ఆటగాళ్లు డ్రా కోసం కాకుండా దూకుడుగా, గెలవాలనే పట్టుదలతో ఆడటం గతంలో ఎన్నడూ చూడని పరిణామం. దీంతో పాటు మననుంచి మాటల ద్వారా ఇలాంటి ప్రతిఘటనను మాత్రం ఆసీస్ అస్సలు ఊహించలేదని మాకు అర్థమైంది. మరోవైపు ధోని ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించాక, మాతో ఉన్నా కూడా అసలెప్పుడు దానిపై ఏ రకంగానూ అతను మాట్లాడలేదు.
ఆటగాళ్ల ప్రవర్తన: నేను మరో మూడు రోజుల్లో బీసీసీఐకి నా నివేదిక ఇస్తాను. అసలు మన క్రికెటర్లంతా సిరీస్ ఆసాంతం చాలా బుద్ధిగా ఉన్నారు. ఆటపై నిబద్ధతతో, అంకితభావంతో వారు వ్యవహరించారు. సరిగ్గా చెప్పాలంటే క్రమశిక్షణ పరంగా నాకు ఎలాంటి పని కల్పించలేదు. గత ఆసీస్ సిరీస్‌ల తరహాలో ఎలాంటి వివాదాలు కూడా చెలరేగలేదు. కాబట్టి నా నివేదికలో కూడా ఎలాంటి సంచలనాలు ఉండవు. కోహ్లి, ధావన్ గొడవ కూడా పచ్చి అబద్ధం. ఇక రెండు వారాల పాటు ఫ్యామిలీలను బోర్డు అనుమతించింది కాబట్టి కోహ్లి, అనుష్క వ్యవహారంపై కూడా చర్చ అనవసరం.
హ్యూస్ మరణం: మేం ఆసీస్‌కు వెళ్లగానే జరిగిన ఆ ఘటనతో షాక్‌కు గురయ్యాం. అందరం కోలుకునేందుకు సమయం పట్టింది. అంత్యక్రియలకు నేనూ హాజరయ్యాను. హ్యూస్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం క్రికెట్‌ను అభిమానించేవారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలనుంచి రావడం చాలా ఆశ్చర్య పరిచింది. ఒక క్రికెటర్ అంత్యక్రియల్లో అంత పెద్ద సంఖ్యలో జనాన్ని ఎప్పుడూ చూడలేదు.
మైదానం బయట..: ఆసీస్ ప్రధాని ఇచ్చిన విందు చాలా బాగా జరిగింది. మాతో ఆయన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఆ సమయంలో క్రికెటేతర అంశాల గురించి కోహ్లి చేసిన ప్రసంగం ది బెస్ట్‌గా చెప్పవచ్చు. సిడ్నీ ఒపెరా హౌస్ సమీపంలోని ఒక హోటల్‌కు వెళ్లి జట్టు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంది. సహజంగానే ఆటగాళ్లంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయినా ఎక్కడా గీత దాటలేదు. అనేక మంది దిగ్గజాలతో కూడిన జట్టుకు నాలుగేళ్ల క్రితం నేను బంగ్లాదేశ్‌లో మేనేజర్‌గా వ్యవహరించాను. దాంతో పోలిస్తే వీరిలో చాలా మంది కొత్త కుర్రాళ్లే. నాకు ఇదో కొత్త అనుభవం.