
గుర్తింపు కోసమే అలా చేస్తున్నారు
సరైన గుర్తింపు దక్కడం లేదనే భావనతో చాలామంది కోచ్‌లు ఆటగాళ్లను తమ దగ్గరే చాలా కాలం ఉంచుకుంటున్నారని
కోచ్‌ల పరిస్థితిపై గోపీచంద్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: సరైన గుర్తింపు దక్కడం లేదనే భావనతో చాలామంది కోచ్‌లు ఆటగాళ్లను తమ దగ్గరే చాలా కాలం ఉంచుకుంటున్నారని బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ఓ ఆటగాడిని వెలుగులోకి తీసుకొచ్చే కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషిని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘నిజం చెప్పాలంటే కోచ్‌లు పడే తపన, కృషి ఎక్కువగా హైలైట్ కావడం లేదు. శిక్షణ శిబిరాలకు హాజరయ్యే కోచ్‌లకు మంచి వేతనాలు లభించడం లేదు. సహాయక సిబ్బంది పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆటగాళ్ల వెనకాల ఉన్న వారిని మనమంతా గుర్తించాలి.
విద్యలో కేజీ, డిగ్రీ, పీజీ వర్గీకరణ ఉన్నట్టు శిక్షణలో అలాంటిదేమీ ఉండదు. ఆటగాళ్ల ప్రదర్శనతో కోచ్‌ల గుర్తింపు అనుసంధానమై ఉంటుంది. అందుకే ఆటగాళ్లు రాటుదేలే వరకు తమ దగ్గరే అట్టిపెట్టుకుంటున్నారు. ఇదంతా వారు తమ గుర్తింపు కోసమే చేస్తున్నారు’ అని గోపీచంద్ వివరించారు. కొన్నేళ్లుగా దేశంలో బ్యాడ్మింటన్ చాలా అభివృద్ధి చెందిందని, అయితే మున్ముందు ఇదే స్థాయిలో ఉండడం సవాల్‌గా మారిందని అన్నారు.