సన్‌రైజర్స్‌ మెరుపులు సరిపోలేదు

Sunrisers Hyderabad Overall Performance In IPL 2018 - Sakshi

కెప్టెన్‌ మెరిసినా మిడిలార్డర్‌ వైఫల్యం

ప్లే ఆఫ్స్‌ నుంచి జట్టుకు కష్టాలు

ఫైనల్లో చేతులెత్తేసిన బౌలర్లు

ఫలితంగా ట్రోఫీ చెన్నై చెంతకు  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.... ఐపీఎల్‌లో అత్యధిక విజయాలరేటు నమోదు చేసిన జట్టు... లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌... ప్లే ఆఫ్‌ బెర్తు దక్కించుకున్న మొదటి జట్టు... అత్యల్ప స్కోర్ల మ్యాచ్‌ల్లోనూ అలవోక విజయాలు... పటిష్ట బౌలింగ్‌ దళం... కానీ కీలక సమయంలో తడబాటు... చివర్లో లయ కోల్పోయి గెలుపునకు దూరంగా జరిగింది. ఫలితంగా ఐపీఎల్‌ ట్రోఫీని చెన్నై చేతుల్లో పెట్టేసింది.   

సాక్షి, హైదరాబాద్‌: కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌.. బౌలర్లు రషీద్‌ఖాన్, భువనేశ్వర్‌ల ప్రదర్శనలతో ఎలాగైనా ట్రోఫీ ఈసారి  సన్‌రైజర్స్‌ హైదరాబాదేనని ఆశించిన అభిమానులకు చివర్లో నిరాశ ఎదురైంది. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించిన సన్‌ బౌలింగ్‌ బృందం చివర్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ముందు కుదేలైంది. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఎప్పటిలాగే ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడటంతో ఫైనల్‌ ఫలితం మరోలా వచ్చింది. వాట్సన్‌ మెరుపు సెంచరీతో చెన్నై 8 వికెట్లతో గెలిచి ఐపీఎల్‌ ట్రోఫీని అందుకుంది. లీగ్‌ దశలో వరుసగా తొలి 11 మ్యాచ్‌ల్లో కేవలం రెండే పరాజయాలు. హైదరాబాద్‌ జోరుకు ఇది నిదర్శనం. కానీ తర్వాత లయను కోల్పోయిన సన్‌ చివరి 6 మ్యాచ్‌ల్లో రెండే విజ యాలు సాధించింది. బౌలింగ్‌ ప్రదర్శనలు బాగున్నప్పటికీ బ్యాట్స్‌మెన్‌ తీరు మారకపోవడంతో రైజర్స్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రతి మ్యాచ్‌లో ఏ ఒక్కరో కనబరిచిన అద్భుత ప్రతిభ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.
 
మంచి కెప్టెన్‌ దొరికాడు...
2016లో సన్‌రైజర్స్‌ టైటిల్‌ గెలవడంలో నాటి కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కీలకం. బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా వార్నర్‌ ఐపీఎల్‌కు దూరమవడంతో అనూహ్యంగా కెప్టెన్సీ దక్కించుకున్న న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌... దాదాపు వార్నర్‌ను మరిపించాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ భారాన్ని ఒక్కడే మోశాడు. 52.50 సగటుతో 735 పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. ఇందులో 8 అర్ధసెంచరీలు ఉండటం విశేషం. కానీ మరో ఎండ్‌లో శిఖర్‌ ధావన్‌ (497) నిలకడలేమి కొనసాగింది. లీగ్‌ దశలో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ కీలకమైన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్లోనూ ధావన్‌ పేలవంగా ఆడాడు. వికెట్‌ కీపర్లు సాహా, శ్రీవత్స్‌ గోస్వామి కూడా రాణించలేకపోయారు. మిడిలార్డర్‌లో షకీబుల్‌ హసన్, మనీశ్‌ పాండే తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. చివర్లో ఫైనల్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌ తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే అతని ఉత్తమ ప్రదర్శనగా చెప్పవచ్చు.  

బౌలింగే బలం..
రాయల్‌ చాలెంజర్స్‌పై 146, రాజస్తాన్‌ రాయల్స్‌పై 151, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 132, ముంబై ఇండియన్స్‌పై 118 పరుగుల స్వల్ప స్కోర్లను నమోదు చేసిన సన్‌రైజర్స్‌ ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలే సాధించింది. దీనికి కారణం సన్‌ బౌలింగ్‌ బృందమే. బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట పేసర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్‌... స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చెలరేగిపోయారు. అసాధ్యమనుకున్న చోట అద్భుత విజయాలను అందించారు. ఈ సీజన్‌లో కౌల్, రషీద్‌ఖాన్‌ చెరో 21 వికెట్లను దక్కించుకుని అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పర్పుల్‌ క్యాప్‌ దక్కించుకున్న టై (24) వీరికన్నా కేవలం 3 వికెట్లు మాత్రమే ఎక్కువ సాధించాడు. షకీబుల్‌హసన్‌ (14 వికెట్లు), సందీప్‌ శర్మ (12) కూడా రాణించారు.

ప్లే ఆఫ్‌ నుంచే పతనం...
లీగ్‌ దశలో అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ ప్లేఆఫ్స్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. బెంచ్‌ బలాన్ని పరీక్షిస్తున్నట్లు విలియమ్సన్‌ జట్టులో మార్పులు చేయడం కష్టాల్ని తెచ్చిపెట్టింది. బాసిల్‌ థంపి, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ కెప్టెన్‌ అంచనాల్ని అందుకోలేకపోయారు. బెంగళూరుతో మ్యాచ్‌లో థంపి ఏకంగా 70 పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్లే ఆఫ్‌ నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ ఆడిన బ్రాత్‌వైట్‌ చెన్నైతో జరిగిన క్వాలిఫయర్‌లో 18 పరుగులిచ్చి విజయాన్ని దూరం చేశాడు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో అతను కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అంతకుముందు 118 పరుగుల్ని కూడా నిలుపుకున్న సన్‌రైజర్స్‌ నాకౌట్‌ 4 మ్యాచ్‌ల్లో రెండుసార్లు 170కి పైగా స్కోరు చేసి కూడా గెలవలేకపోయింది. మరోవైపు విలియమ్సన్, శిఖర్‌ మినహా సన్‌ బ్యాట్స్‌మెన్‌ యూసుఫ్‌ (15 మ్యాచ్‌ల్లో 260), మనీశ్‌ పాండే (15 మ్యాచ్‌ల్లో 284), షకీబ్‌ (17 మ్యాచ్‌ల్లో 239) ఎవరూ కూడా 30 సగటును సాధించలేకపోవడం వారి వైఫల్యాన్ని సూచిస్తుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top