
ముంబై: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా ‘ఫిఫా’ వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... భారత ఫుట్‌బాల్ జట్టు దిగువ స్థాయి టోర్నీలో శుభారంభం చేసింది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా శుక్రవారం చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తన కెరీర్‌లో 99వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్స్ (14వ, 34వ, 62వ నిమిషాల్లో)తో ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చెత్రితో పాటు ఉదంత సింగ్ (48వ ని.లో), ప్రణయ్ హల్దార్ (78వ ని.లో) చెరో గోల్ చేశారు. నాలుగు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తదుపరి మ్యాచ్‌లో సోమవారం కెన్యాతో తలపడనుంది.