హాంగ్ కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) సరికొత్త రికార్డు నమోదైంది. నేపాల్ పేసర్ రషీద్ ఖాన్ (Rashid Khan).. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
🚨Hat-trick Alert🚨
A Rashid Khan you didn’t see coming 👀
The Nepal pacer pulls off a sensational hat-trick vs Afghanistan in the #HongKongSixes 🎯 pic.twitter.com/X9NcP2dcAT— FanCode (@FanCode) November 7, 2025
ఈ మ్యాచ్‌లో రషీద్ వరుస బంతుల్లో ఆఫ్ఘన్ బ్యాటర్లు సెదిఖుల్లా పచ్చా, షారాఫుద్దీన్ అష్రఫ్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్‌ను ఔట్ చేశాడు. తన కోటా 2 ఓవర్లలో మొత్తం 4 వికెట్లు తీసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రషీద్‌కు ముందు ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు శ్రీలంక బౌలర్ కంగనిగే తరిండు (2-0-33-4) పేరిట ఉండేవి.
తాజా మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చెలరేగినా నేపాల్ పరాజయంపాలవడం కొసమెరుపు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు కరీమ్ జనత్ (10 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు), నాలుగో నంబర్ ఆటగాడు ఫర్మానుల్లా సఫీ (9 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
టోర్నీ రూల్స్ ప్రకారం ఆరుగురు ఆటగాళ్లలో ఐదుగురు ఔటైనా ఓవర్లు మిగిలి ఉండే ఒక్కరే బ్యాటింగ్ కొనసాగించవచ్చు. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. రషీద్ ఖాన్ ఐదో ఓవర్ మొదటి మూడు బంతులకు హ్యాట్రిక్ వికెట్లు తీసినా.. ఫర్మానుల్లా సఫీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఒక్కడు కావడంతో అతడు చెలరేగి ఆడాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్‌కు కూడా సుడిగాలి ఆరంభం లభించింది. ఓపెనర్, కెప్టెన్ అయిన సందీప్ జోరా కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సందీప్ క్రీజ్‌లో ఉన్నంత వరకు గెలుపు దిశగా పయనించిన నేపాల్, ఆతర్వాత నిదానించింది. అంతిమంగా నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులకే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


