సుమీత్‌ నాగల్‌ సంచలనం

Sumit Nagal Qualifies For US Open Main Draw - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత

తొలి రౌండ్‌లో ఫెడరర్‌తో ‘ఢీ’

న్యూయార్క్‌: భారత టెన్నిస్‌ యువతార సుమీత్‌ నాగల్‌ తన కెరీర్‌లోనే గొప్ప ప్రదర్శన చేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల సుమీత్‌ ప్రధాన ‘డ్రా’లో బెర్త్‌ దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 190వ స్థానంలో ఉన్న సుమీత్‌ 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌ లో 5–7, 6–4, 6–3తో జావో మెనెజెస్‌ (బ్రెజిల్‌)పై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్‌లో 1–4తో వెనుకబడిన దశలో సుమీత్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్‌లో సుమీత్‌ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌తో సుమీత్‌ తలపడనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మంగళవారం ఉదయం జరుగుతుంది.  

1998 తర్వాత...: సుమీత్‌ మెయిన్‌ ‘డ్రా’కు చేరుకోవడంతో... 1998 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు మెయిన్‌ ‘డ్రా’లో ఆడనున్నారు. ర్యాంకింగ్‌ ఆధారంగా భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ యూఎస్‌ ఓపెన్‌లో నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. తొలి రౌండ్‌లో అతను ఐదో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా)తో తలపడతాడు. చివరిసారి 1998 వింబుల్డన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో లియాండర్‌ పేస్, మహేశ్‌ భూపతి రూపంలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.  

‘‘టెన్నిస్‌ రాకెట్‌ పట్టే ప్రతి ఒక్కరూ ఏనాడైనా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మెయిన్‌ ‘డ్రా’లో ఆడాలని కలలు కంటారు. నా విషయంలోనూ అంతే. యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్థర్‌ యాష్‌ స్టేడియం సెంటర్‌ కోర్టులో వేలాది మంది ప్రేక్షకుల నడుమ ఫెడరర్‌లాంటి దిగ్గజంతో తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. టెన్నిస్‌లో దేవుడిలాంటివాడైన ఫెడరర్‌తో తలపడే అవకాశం రావాలని ఇటీవలే కోరుకున్నాను. ఇంత తొందరగా నా కోరిక తీరుతుందని అనుకోలేదు. ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’’
– సుమీత్‌ నాగల్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top