
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సన్నాహకంగా నిర్వహించే అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇండోనేసియాలోని జకార్తాలో ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ఈ మీట్ జరుగుతుంది. పురుషుల 4 గీ 100 మీటర్ల రిలేలో తెలంగాణ అథ్లెట్ సీహెచ్ సుధాకర్‌కు స్థానం లభించింది.
సుధాకర్‌తోపాటు ఈ రిలే జట్టులో మొహమ్మద్ సాదత్, ఏకలవ్య దాసన్, విద్యాసాగర్, అనురూప్ జాన్, సత్నామ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలంగా జాతీయ అథ్లెటిక్స్ స్ప్రింట్ రేసుల్లో సుధాకర్ నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది గుంటూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన సుధాకర్ 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.