ట్యాంపరింగ్‌; ఆసీస్‌పై చర్యలు.. అబ్బో సూపరు!

As Steve Smith And Bencraft Escapes Strong Charges Netizens Slams ICC - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: నిన్నటికి నిన్న స్మిత్‌ భుజం తాకడన్న కారణంతో రబడాపై తీవ్రచర్యలు.. చాన్నాళ్ల కిందట బంతికి అంటిన మట్టి తుడిచినందుకే సచిన్‌ టెండూల్కర్‌పై మ్యాచ్‌ నిషేధం.. తప్పెవరిదో తేలకముందే మంకీగేట్‌ వివాదంలో హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధం.. ఇప్పటికి కూడా అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజుల్లో కోతలు! అదే ఒక జట్టు జట్టంతా విలువల్ని తుంగలో తొక్కేసినా, ‘అవును.. మేం పథకం ప్రకారమే బాల్‌ ట్యాంపరింగ్‌ చేశా’మని నిస్సిగ్గుగా చెప్పుకున్నప్పటికీ వారిపై అరకొర చర్యలు!!

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్‌ జట్టుపై అరకొర చర్యలు తీసుకున్న ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. సూత్రధారి స్టీవ్‌ స్మిత్‌పై ఒక్క టెస్టు నిషేధం, పాత్రధారి బెన్‌క్రాఫ్ట్‌కు జరిమానతో ఐసీసీ సరిపెట్టడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా పట్ల తనకున్న విధేయతను పదేపదే ప్రకటించుకుంటున్న ఐసీసీ తీరును తప్పుపడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వారిలో ప్రముఖ క్రికెటర్లు కూడా ఉన్నారు. కాగా, ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం ట్యాంపరింగ్‌ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు, స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లపై జీవితకాల నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ మేరకు అధికార ప్రకటనలేవీ ఇప్పటివరకు జారీకాలేదు.

వారెవ్వా ఐసీసీ: హర్భజన్‌
‘‘బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో గొప్ప శిక్షే వేశారు! వారెవ్వా! అన్ని ఆధారాలున్నా బెన్‌క్రాఫ్ట్‌పై నిషేధంలేదు. గతాన్ని మర్చిపోయారా? మితిమిరి అప్పీల్‌ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కొ మ్యాచ్‌ నిషేధించారు. 2008 సిడ్నీలోనూ జాతివివక్ష వ్యాఖ్యలంటూ(మంకీగేట్‌ వివాదం) నాపై మూడు టెస్టుల వేటేశారు. ఒక్కొక్కరికి ఒక్కో శిక్షలా? వ్యక్తి బట్టి, అతను ప్రాతినిథ్యం వహించే జట్టునుబట్టి ఐసీసీ అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?’’ అని నిప్పులుచెరిగాడు లెజెండ్‌ హర్భజన్‌ సింగ్‌.

ఆసీస్‌కు ఊహించని మద్దతు
బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఆసీస్‌, ఐసీసీలపై నెటిజన్ల విమర్శలు కొనసాగుతున్నవేళ ఆ జట్టుకు ఊహించని మద్దతు లభించింది. అవును. భారత మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా కాస్త భిన్నంగా స్పందించారు. తప్పు చేసినట్లు ఒప్పుకున్నందుకుగానూ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌లను అభినందించారు. ‘‘ఆటలో ఇలాంటి ఉదంతాలు గతంలోనూ జరిగాయి. స్టీవ్‌ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌లు తప్పుచేశారని ఐసీసీ భావిస్తే వారిని శిక్షించాల్సిందే. అయితే వాళ్లు తప్పు చేసినట్లు అంగీకరించడం ఇక్కడ గమనార్హం. ఒకవేళ ఆసీస్‌ ప్లేయర్లు తామే పొరపాటూ చేయలేదని వాదించిఉంటే గనుక చర్యలు మరోలా ఉండేవనడంలో సందేహంలేదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డారు.

30 నుంచి నాలుగో టెస్టు..
సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు మార్చి 30 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభంకానుంది. ఆదివారం ముగిసిన మూడో టెస్టులో ఆసీస్‌ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటనతో తీవ్ర ఒత్తిడిలో పడిపోయిన ఆ జట్టు మూడో టెస్టులో322 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో సఫారీలు 2–1తో ముందంజ వేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top