‘సూపర్‌ హిట్‌’ మ్యాన్‌...

special story to  rohith sharma - Sakshi

సాక్షి క్రీడా విభాగం: అపార ప్రతిభావంతుడు... అందుకు తగిన న్యాయం చేయలేడు... సుదీర్ఘ సమయం ఆడగలడు... కానీ మ్యాచ్‌ విన్నర్‌ అని భరోసా లేదు... అగ్రశ్రేణి బ్యాట్స్‌మనే... తేలిగ్గా వికెట్‌ ఇచ్చేస్తాడు... నైపుణ్యంలో కోహ్లి కంటే మిన్న... అయినా అతడిలా కసికసిగా కనిపించడు... అన్నీ ఉన్నా ఇంకా ఏదో లోటు... ఇవీ రోహిత్‌ గురించి ఉన్న విశ్లేషణలు. బహుశా భారత క్రికెట్‌లో ఏ ఆటగాడికీ ఇన్ని ఘనతలు–లోపాలు ఆపాదించి ఉండరేమో! ఈ ముంబై బ్యాట్స్‌మన్‌కు మాత్రం అంతా అలా జరిగిపోయింది. కొన్నిసార్లు అతడి బాడీ లాంగ్వేజ్, ప్రదర్శన ఇందుకు తగ్గట్లే ఉండేవి. దీంతో మళ్లీ మళ్లీ ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితి.

మారుతున్నాడు...
రోహిత్‌ మారాడు. మారుతున్నాడు. ఇంకా మారగలడు! కొన్నేళ్లుగా అతడి ప్రస్థానం గమనిస్తే ఇది స్పష్టమవుతోంది. ఐపీఎల్‌లో సారథ్యం పుణ్యాన ఒత్తిడిని అధిగమించడం నేర్చుకున్నాడు. ఓపెనింగ్‌కు మారాక స్థిరత్వం అలవర్చుకున్నాడు. జట్టులోని పోటీ దృష్ట్యా చురుకుదనం ఒంటబట్టించుకున్నాడు. ప్రతిఫలంగానే టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న అతడికి పరిస్థితుల రీత్యా వన్డే సారథ్యమూ దక్కింది. కోహ్లి తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనే అనధికారిక  గుర్తింపుగానూ దీనిని భావించవచ్చు.

వారిద్దరి తర్వాత ఇతడేనా..!
భారత వన్డే క్రికెట్‌ బ్యాట్స్‌మెన్‌లో ఇప్పటికి తొలి రెండు స్థానాలు సచిన్, కోహ్లిలవే. గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్‌ల శకం ముగిసింది. ధోనీ, యువరాజ్‌ కెరీర్‌ చరమాంకంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా చూసుకున్నా, వయసు ప్రకారం అంచనా వేసినా సచిన్, కోహ్లిల తర్వాతి స్థానం ఆక్రమించేందుకు రోహిత్‌కు అవకాశం ఉంది. 30 ఏళ్ల రోహిత్‌ సునాయాసంగా అయిదారేళ్లు ఆడగలడు. ఓపెనర్‌ అవతారమెత్తిన ఈ నాలుగేళ్లలోనే మూడు డబుల్‌ సెంచరీలు బాదిన లెక్కలను బేరీజు వేసుకుంటే భారత్‌ తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానానికి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆరు సెంచరీల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మున్ముందు రెండో స్థానానికి కోహ్లితో సైతం ‘పరుగు’ పోటీలో ఉంటాడేమో అనిపిస్తోంది.

300 కొట్టేస్తాడేమో!
మొహాలీలో రోహిత్‌ ఆడిన బంతులు 153. ఇందులో శతకానికే 115 (అర్ధ సెంచరీకి 65, సెంచరీకి 50) పోయాయి. ద్విశతకం చేరుకోవడానికి మరో 36 మాత్రమే ఆడాడు. వాస్తవానికి ఈ వేగం తొలి నుంచి కానీ, 50 పూర్తయ్యాక కానీ చూపెడితే తన అత్యధిక స్కోరు (264)ను అధిగమించేవాడేమో. ఇంకొంచెం ముందుకు ఆలోచిస్తే వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసేవాడేమో.

ఇంకేం చేయాలి...
ప్రస్తుతం రోహిత్‌ టైమ్‌ నడుస్తోంది. ఈ ఊపును కొనసాగించాలి. ఇంకా మెరుగయ్యేందుకు అవకాశాలు సృష్టించుకోవాలి. ఈ విషయంలో కోహ్లినే స్ఫూర్తిగా తీసుకోవాలి. దీనికి చేయాల్సిందల్లా ఆట, బాడీ లాంగ్వేజ్, శారీరక దారుఢ్యం, గెలుపు కాంక్షల్లో 2008 నాటి కోహ్లికి, 2017 నాటి కోహ్లికి ఎంత తేడా ఉన్నదో ఒక్కసారి పరిశీలించడమే. ఇక రోహిత్‌ మధ్యలో బరువు పెరిగి, ఆట లయ తప్పి వేటుకు గురవడం మినహా.. 2008లో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఇప్పుడు అనుభవం వచ్చింది, జట్టులో స్థానానికి ఢోకా లేదు కాబట్టి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతూ చురుకుగా వ్యవహరించాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top