102 డిగ్రీల జ్వరాంతో 103 పరుగులు

Special Story About Sunil Gavaskar Century With 102 Degree Fever - Sakshi

వన్డేల్లో సునీల్‌ గావస్కర్‌ ఏకైక సెంచరీ

8 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 నాటౌట్‌

కెరీర్‌ చివరి టోర్నమెంట్‌లో దిగ్గజ క్రికెటర్‌ చిరస్మరణీయ మ్యాచ్‌

టెస్టు క్రికెటర్‌గా, దిగ్గజ ఆటగాడిగా శిఖరాన నిలిచిన సునీల్‌ గావస్కర్‌ వన్డే కెరీర్‌ గణాంకాలు అంతంత మాత్రమే. 1983 వరల్డ్‌ కప్‌ విజేత జట్టులో సభ్యుడిగా నిలిచినా... రెండేళ్ల తర్వాత దాదాపు అదే స్థాయి టోర్నీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నిలిపినా ఒక బ్యాట్స్‌మన్‌గా గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌ ఏవీ అతని బ్యాట్‌ నుంచి రాలేదు. నాటి ప్రమాణాల ప్రకారం చూసినా గావస్కర్‌ ప్రదర్శన అతి సాధారణం. అయితే చివరకు తన ఆఖరి టోర్నీలో మాత్రం అతను  ఒక అద్భుతమైన శతకంతో అభిమానులను అలరించాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై సన్నీ చేసిన సెంచరీ ఎప్పటికీ మరచిపోలేనిది.

సునీల్‌ గావస్కర్‌ ముందే ప్రకటించినట్లు 1987 రిలయన్స్‌ వరల్డ్‌కప్‌ అతని చివరి వన్డే టోర్నీ. ఆ తర్వాత గుడ్‌బై చెప్పేందుకు సన్నీ సిద్ధమైపోయాడు. టెస్టులతో పోలిస్తే గావస్కర్‌ వన్డే రికార్డు గొప్పది కాదు. పైగా 1975 ప్రపంచకప్‌లో ఏకంగా 174 బంతులు ఆడి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన చెత్త ఘనత కూడా అతని పేరిటే ఉంది. కెరీర్‌ చివరిదశలో కూడా మరో దూకుడైన ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌కు సహకారం అందించే రెండో ఓపెనర్‌ పాత్రలోనే అతడిని అంతా చూస్తున్నారు. కానీ న్యూజిలాండ్‌పై గావస్కర్‌ తన శైలికి భిన్నంగా ఆడి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తప్పనిసరి పరిస్థితుల్లో...
వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో నాగపూర్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అప్పటి వరకు 106 వన్డేలు ఆడిన గావస్కర్‌ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. 27 హాఫ్‌ సెంచరీలు సాధించినా అందులో పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి కూడా ఏమీ లేవు. మ్యాచ్‌కు ముందు సన్నీ బాగా జ్వరంతో బాధపడుతున్నాడు. తాను ఆడలేనంటూ ముందే తప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే చీఫ్‌ సెలక్టర్‌ బాపు నాదకర్ణి ఒత్తిడితో బరిలోకి దిగాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేయగలిగింది. మామూలుగానైతే ఇది సునాయాస లక్ష్యమే. పైగా భారత్‌ అప్పటికే సెమీఫైనల్లోకి ప్రవేశించింది కాబట్టి ఒత్తిడి కూడా లేదు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్‌ వచ్చింది.

దూకుడైన బ్యాటింగ్‌తో...
రన్‌రేట్‌తో నిమిత్తం లేకుండా మ్యాచ్‌ను గెలిస్తే భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి పాకిస్తాన్‌ అవుతుంది. అదీ పాక్‌కు వెళ్లి ఆడాలి. ముంబైలో ఇంగ్లండ్‌తో తలపడాలని కపిల్‌దేవ్‌ బృందం భావిస్తోంది. అలా జరగాలంటే కివీస్‌ విధించిన 222 పరుగుల లక్ష్యాన్ని 42.2 ఓవర్లలో అందుకోవాలి. అప్పటి లెక్కల ప్రకారం 5.25 రన్‌రేట్‌తో పరుగులు చేయడం అంత సులువు కాదు. పైగా ఓపెనర్‌గా గావస్కర్‌ సంగతి అందరికీ తెలుసు. జింబాబ్వేతో జరిగిన అంతకుముందు మ్యాచ్‌లో సన్నీ 50 పరుగులు చేసేందుకు ఏకంగా 114 బంతులు తీసుకున్నాడు. కాబట్టి ఈసారి పెద్దగా ఆశలు లేవు. అయితే ఇప్పుడు అలా జరగలేదు. గావస్కర్‌ తన సహచరుడు శ్రీకాంత్‌తో పోటీ పడి వేగంగా పరుగులు సాధించాడు. భారత అభిమానులంతా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన షాట్లతో విరుచుకు పడ్డాడు. చాట్‌ఫీల్డ్‌ వేసిన ఓవర్లలో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అతను 20 పరుగులు రాబట్టడం విశేషం. 58 బంతుల్లో 75 పరుగులు చేసిన శ్రీకాంత్‌ ఎట్టకేలకు వెనుదిరిగే సమయానికి భారత్‌ 136 పరుగులు చేసింది.

ఆ తర్వాత గావస్కర్‌ జోరు ఆగలేదు. అజహర్‌ (41 నాటౌట్‌) ఆటతో మరింతగా తన ధాటిని ప్రదర్శించాడు. ఈ క్రమంలో తన అత్యధిక స్కోరు 92ను అధిగమించాడు. ఎట్టకేలకు మోరిసిన్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా సింగిల్‌ తీయడంతో 85 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అప్పట్లో ప్రపంచకప్‌లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. రెండో వికెట్‌కు సన్నీ, అజహర్‌ కలిసి అజేయంగా 88 పరుగులు జోడించారు. మొత్తంగా 6.96 రన్‌రేట్‌తో 32.1 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 224 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది. గ్రూప్‌ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. మరో ఐదు రోజుల తర్వాత తన సొంత మైదానం వాంఖడేలో ఇంగ్లండ్‌తో సెమీస్‌తో కేవలం 4 పరుగులే చేసిన గావస్కర్‌ ఆ మ్యాచ్‌తో రిటైర్‌ అయ్యాడు. అయితే అతని ఏకైక సెంచరీ మాత్రం అభిమానుల మదిలో పదిలంగా నిలిచిపోయింది.

చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ కూడా...

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత పేసర్‌ చేతన్‌ శర్మ తీసిన హ్యాట్రిక్‌ కూడా మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. కెన్‌ రూథర్‌ఫోర్డ్, ఇయాన్‌ స్మిత్, చాట్‌ఫీల్డ్‌లను వరుస బంతుల్లో అవుట్‌ చేసి చేతన్‌ ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ఈ మూడు కూడా క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. సన్నీ, చేతన్‌లు ఇద్దరికీ సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top