ఐదింటిలో గెలిస్తే! ఈసారి వదలను!

special interview to pv sindhu and srikanth - Sakshi

ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించిన జోరులో ఒకరు... రెండు సూపర్‌ సిరీస్‌ విజయాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం ఇచ్చిన ఉత్సాహంతో మరొకరు... సంవత్సరం ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి ఇప్పుడు దానికి మరో చక్కటి ముగింపు ఇవ్వాలనే ప్రయత్నం ఇద్దరిదీ. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సత్తా చాటేందుకు భారత టాప్‌ షట్లర్లు, తెలుగు తేజాలు కిడాంబి శ్రీకాంత్‌ , పీవీ సింధు సన్నద్ధమయ్యారు. టాప్‌–8 మంది ఆటగాళ్లు మాత్రమే తలపడే ఈ టోర్నీ రేపటి నుంచి ఆదివారం వరకు జరుగుతుంది. సోమవారం టోర్నీ ‘డ్రా’ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో తమ ఇటీవలి ప్రదర్శన, టోర్నీలో విజయావకాశాలపై వారిద్దరితో దుబాయ్‌ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది ప్రత్యేక ఇంటర్వ్యూ...  

కెరీర్‌లో 2017 ముద్ర...
ఆటగాడిగా ఇన్నేళ్లలో ఇంత గొప్ప సంవత్సరం రాలేదు. చాలా సంతోషంగా ఉంది అనడం చిన్న మాట అవుతుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్‌ ఓపెన్‌... ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుసగా సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధిస్తూ పోవడం గొప్పగా అనిపించింది.  రెండేసి వారాల చొప్పున వరుసగా రెండు టైటిళ్లు సాధించడం కూడా అద్భుతంలా సాగింది. నా ఆటను మరింత మెరుగుపర్చడంతో పాటు గోపీ సర్‌ ప్రణాళికల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పగలను. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడినా... అది మన సాయిప్రణీత్‌తోనే కాబట్టి ఎక్కువగా బాధించలేదు.  

సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సన్నద్ధత, విజయావకాశాలపై...
సర్క్యూట్‌లో పెద్ద టోర్నీగా ఫైనల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానికి అనుగుణంగానే గట్టిగా సిద్ధమయ్యాను. గత రెండు టోర్నీలు ఆడకపోవడం వల్ల కూడా వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టి పెట్టేందుకు తగిన సమయం లభించింది. ఒక్క మాట మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ నాలుగు సూపర్‌ సిరీస్‌ టోర్నీల విజయాలు ఇచ్చిన జోష్‌ మాత్రం తప్పనిసరిగా నా ఆటలో కనిపిస్తుంది. నా ఆటతీరు (యాటిట్యూడ్‌)లో మార్పు, షాట్‌ల ఎంపికలో కూడా ఆ మార్పును చూడవచ్చు. అదే ఉత్సాహంతో ఫైనల్స్‌లో కూడా ఆడగలనని నమ్ముతున్నా.  

‘డ్రా’ కఠినంగా అనిపిస్తుందా...
బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌లో సులువైన డ్రా గురించి ఆలోచించవద్దు. తొలి మ్యాచ్‌లోనే అక్సెల్‌సన్‌తో తలపడుతున్నాను. ఇది ఒకందుకు మంచిదే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లీగ్‌ దశలో తర్వాతి రెండు మ్యాచ్‌లకు కూడా ఊపు కొనసాగుతుంది.  షి యుఖితో ఇటీవల ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌లో గెలిచాను. అక్సెల్‌సన్‌ను డెన్మార్క్‌లో ఓడించాను. చౌ టీన్‌తో ఒక్కసారే తలపడ్డాను. అయితే ప్రత్యర్థులు ఎవరనేదానికంటే నా ఆటనే నేను ఎక్కువగా నమ్ముకున్నాను. సరిగ్గా చెప్పాలంటే ఇంత బాగా సాగిన సంవత్సరంలో మరో ఐదు మంచి రోజులు చాలు. ఈ ఐదు రోజుల్లో జరిగే ఐదు మ్యాచ్‌లను గెలిస్తే తిరుగుండదు.  

ఫిట్‌నెస్‌ సమస్య తగ్గినట్లేనా...
ఇప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నాను. తొడ గాయం తగ్గిపోయింది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి హాంకాంగ్‌ ఓపెన్‌కు కూడా నేను ఆడగల స్థితిలోనే ఉన్నాను. కానీ పెద్ద టోర్నీ ముందుంది కాబట్టి రిస్క్‌ చేయదల్చుకోలేదు.  

కానీ నంబర్‌వన్‌ అవకాశం చేజారిందిగా...
అలా ఏమీ అనుకోవడం లేదు. నంబర్‌వన్‌ కోసం చైనా ఓపెన్‌ ఆడితే పొరపాటున గాయం పెరిగి అది మరింత సమస్యగా మారిపోయేదేమో. అయితే ర్యాంకింగ్‌ను దృష్టిలో పెట్టుకొని, దాని గురించి ఆలోచిస్తూ టోర్నీలు ఆడరాదని నిర్ణయించుకున్నాము. విజయాలు సాధిస్తే ర్యాంక్‌ ఎలాగూ వస్తుంది. అయినా బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌ గెలిస్తే నేను నంబర్‌వన్‌ అవుతాను కదా.  

డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగంపై...
నన్ను నియమిస్తున్నట్లు ప్రకటన మాత్రమే వచ్చింది. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు అందుకోలేదు. అప్పుడే బాధ్యతల గురించి ఆలోచిస్తా. అయితే ఇలా ఎంపిక కావడం మాత్రం సంతోషంగా ఉంది.   

ఇద్దరికీ సత్తా ఉంది.  
సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్‌ అన్ని విధాలా సన్నద్ధమై వచ్చారు. వారి తాజా ఫామ్, ప్రత్యర్థులను బట్టి చూస్తే ముందైతే సెమీఫైనల్‌ కచ్చితంగా చేరగలరని నమ్ముతున్నాను. ‘డ్రా’ గురించి ఆందోళన అనవసరం. ఇలాంటి పెద్ద టోర్నీలో అది సహజం. గతంలో అనేక మంది బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించిన రికార్డు వీరిద్దరికీ ఉంది. 2017లో మనం అలాంటి మ్యాచ్‌లు చాలా చూశాం. కాబట్టి భారత షట్లర్లు ఇద్దరికీ ఫైనల్స్‌ గెలిచే సామర్థ్యం ఉందని భావిస్తున్నా.
– పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌  

ఒకే గ్రూప్‌లో శ్రీకాంత్, అక్సెల్‌సన్‌
వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ తొలి మ్యాచ్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, వరల్డ్‌ చాంపియన్, నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో తలపడనున్నాడు. వీరిద్దరూ గ్రూప్‌ ‘బి’లో ఉన్నారు. ఇదే గ్రూప్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ చౌ టీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ), ఎనిమిదో ర్యాంకర్‌ షి యుఖి (చైనా) ఉన్నారు. గ్రూప్‌ ‘ఎ’లో స్టార్‌ ఆటగాళ్లు చెన్‌ లాంగ్‌ (చైనా), లీ చోంగ్‌ వీ (మలేసియా), సన్‌ వాన్‌ హో (కొరియా), ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) తలపడుతున్నారు.  

మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో హి బింగ్‌ జియావో (చైనా)ను మొదటి మ్యాచ్‌లో పీవీ సింధు ఎదుర్కొంటుంది. ఈ గ్రూప్‌లోనే సయాకా సాటో, అకానె యామగుచి (జపాన్‌) ఉన్నారు. గ్రూప్‌ ‘బి’లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో పాటు ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), సుంగ్‌ జీ హున్‌ (కొరియా), చెన్‌ యుఫె (చైనా) ఉన్నారు. ఒక్కో గ్రూప్‌లో ప్లేయర్‌ తమ గ్రూప్‌లోని మిగతా ముగ్గురితో తలపడతారు. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీస్‌కు చేరతారు.

ఈసారి వదలను
2017లో ఆటతీరుపై...
గత ఏడాది రియో ఒలింపిక్స్‌ రజతం అంతులేని ఆనందాన్ని మిగిల్చితే ఈ సంవత్సరం కూడా బాగా సాగింది. ఇండియన్‌ ఓపెన్, కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలుచుకోగలిగాను. హాంకాంగ్‌లో రన్నరప్‌గా నిలిచాను. డెన్మార్క్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌ పరాజయం కూడా ఉంది. కానీ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్లో పరాజయం మాత్రం చాలా కాలం బాధించింది. అంత గొప్ప మ్యాచ్‌ ఆడి ఓడిపోయాను. అయితే నా కాంస్యాన్ని రజతంగా మార్చుకోగలగడం ఆనందమే. చాలా కాలం తర్వాత నేషనల్స్‌లో కూడా బరిలోకి దిగడం చెప్పుకోదగ్గ విశేషం.

రేపటి నుంచి జరిగే ఫైనల్స్‌పై...
ఒలింపిక్, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ మెడల్స్‌ నా ఖాతాలో ఉన్నాయి. ఇక బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఇది అతి పెద్ద టోర్నీ కాబట్టి కచ్చితంగా విజేతగా నిలవాలని పట్టుదలగా ఉన్నా. 2016లో బాగానే ఆడినా సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాను. ఈసారి అవకాశం పోగొట్టుకోను. అంతకంటే మెరుగ్గా ఆడగలనన్న విశ్వాసం ఉంది. తగినంత సమయం దొరకడంతో చాలా బాగా సన్నద్ధమయ్యా. కలిసొచ్చిన ఈ సంవత్సరాన్ని మరింత సంతోషంగా ముగించాలని భావిస్తున్నా.  

‘డ్రా’ గురించి...
ప్రపంచంలో టాప్‌–8 షట్లర్లు మాత్రమే బరిలోకి దిగుతారు కాబట్టి డ్రా సులువా, కఠినమా అనే విషయంపై అతిగా ఆలోచించలేదు. ఇతర టోర్నీలలో ఆరంభ మ్యాచ్‌లు కాస్త సులువుగా ఉంటాయి. ఇక్కడ ఆ అవకాశం లేదు. పైగా పాయింట్లు సమంగా ఉన్నప్పుడు గెలిచిన గేమ్‌లు, సాధించిన పాయింట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి గెలుపు మాత్రమే కాదు... ప్రతీ పాయింట్, ఎంత తేడాతో గెలిచామన్నది కూడా ముఖ్యం. నా తొలి లక్ష్యం సెమీస్‌ చేరుకోవడమే.   

ఫిట్‌నెస్‌పై...
ఇప్పుడు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కంటే మెంటల్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పగలను. ఇటీవల బ్యాడ్మింటన్‌లో సుదీర్ఘ సమయం మ్యాచ్‌లు సాగుతున్నాయి. శారీరకంగా మేం చేసే శ్రమ దీనికి సరిపోతుంది. కానీ మానసికంగా అంత సేపు ఓపిగ్గా, ఏకాగ్రతతో ఉండటం కష్టమైపోయింది. పాయింట్‌ కచ్చితంగా వస్తుందని భావించిన చోట పొరపాటు జరిగితే అసహనం పెరిగిపోతుంది. అది చివరకు ఒక్క పాయింట్‌ నుంచి మ్యాచ్‌పై ప్రభావం చూపించే వరకు వెళుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీనిపై నేను, గోపీ సర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కోర్టులో ఓపిగ్గా ఆడే తత్వం ఇక ముందు నానుంచి కనిపిస్తుంది.  
వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్‌పై...
టాప్‌ ప్లేయర్లు 12 టోర్నీల్లో పాల్గొనాలంటూ కొత్తగా తెచ్చిన నిబంధన ఎలా అమలవుతుందో చెప్పలేను. ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. దీనిపై కోచ్‌తో చర్చించి ప్లానింగ్‌ చేసుకోవచ్చు. భారత్‌కు సంబంధించి 2018లో ఆసియా, కామన్వెల్త్‌ క్రీడలు కూడా ఉన్నాయి కాబట్టి అది అదనపు సమస్యగా మారవచ్చు.  

డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతల నిర్వహణపై...
కొత్తగా ఉంది. ఎక్కువ రోజులు ఆఫీస్‌కు ఏమీ వెళ్లలేదు. కానీ బాధ్యతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం సెలవులో ఉన్నాను. టోర్నీలు ముగిశాక మళ్లీ వెళతాను.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top