దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌

South Africa Fined For Slow Over-Rate In Centurion - Sakshi

సెంచూరియన్: టీమిండియాతో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో నిర్ణీత సమయంలో తక్కువ ఓవర్లు వేసినందుకు సఫారీ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) భారీ జరిమానా విధించింది. రెండు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించడంతో కెప్టెన్‌ డు ప్లెసిస్‌ మ్యాచ్‌ ఫీజులో 40 శాతం, జట్టు సభ్యుల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత పెట్టింది.

ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం నిర్దేశిత సమయంలో ఏదైనా జట్టు ఒక ఓవర్‌ తక్కువగా వేస్తే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. కెప్టెన్‌కు రెట్టింపు జరిమానా వేస్తారు. దీని ప్రకారం సౌతాఫ్రికా టీమ్‌కు 20 శాతం జరిమానా విధించగా, డుప్లెసిస్‌ తన మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోల్పోనున్నాడు.

కాగా మూడో రోజు ఆటలో అంపైర్లు, రిఫరీతో వాగ్వాదానికి దిగిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై కూడా ఐసీసీ మంగళవారం క్రమశిక్షణా చర్య తీసుకుంది. అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ వేసింది. ఆటగాళ్ల డీ మెరిట్‌ పాయింట్ల విధానం అమల్లోకి వచ్చాక కోహ్లి తొలిసారి ఈ చర్యకు గురయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top