'కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వ‌లేదు'

Sourav Ganguly Reveals What Went Wrong At Kolkata Knight Riders - Sakshi

ముంబై : కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని యాజమాన్యాన్ని కోరినా.. అది జరగలేదని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ యూట్యూబ్ చానెల్‌తో జ‌రిగిన ఇంట‌ర్య్వూలో పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా 2009లో తనని కేకేఆర్‌ కెప్టెన్‌గా తొలగించడానికి గల కారణాలను కూడా గుర్తుచేసుకున్నాడు. 'గౌతమ్ గంభీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం చూశా. అతను కోల్‌కతాకు కెప్టెన్‌ అయ్యాక షారుఖ్‌ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఇది నీ జట్టు, నేను మధ్యలో కలగజేసుకోనని షారుఖ్‌ చెప్పాడని గౌతీ తెలిపాడు. ఇదే విషయాన్ని నేను ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే షారుఖ్‌ను అడిగాను. కానీ అది జరగలేదు. 

అదే స‌మ‌యంలో మిగ‌తా  ఐపీఎల్ ఫ్రాంఛైజీల యాజమాన్యాలు వారి ఆట‌గాళ్ల‌కు పూర్తి స్వేచ్చ‌నిచ్చాయి. ఉదాహరణకు చెన్నైనే తీసుకోండి. ఎంఎస్ ధోనీ ఎలా నడిపిస్తున్నాడో మనకు తెలుసు. అలాగే ముంబైలోనూ రోహిత్‌ శర్మ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. రోహిత్, ధోనీలకు స్వేచ్ఛ ఉంది కాబట్టే సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌లుగా కొనసాగుతున్నారు.  అప్పుడు నన్ను కెప్టెన్‌గా తొలగించడానికి కోచ్‌ జాన్‌ బుచనన్‌ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు. ఐపీఎల్‌ తొలి సీజన్‌ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని, అది నా వల్ల మాత్రం  కాదు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమే' అని గంగూలీ తెలిపాడు.(దటీజ్‌ దాదా.. ఆసియాక‌ప్ వాయిదా)

2008 ఐపీఎల్ మొద‌టి సీజ‌న్ ప్రారంభ‌ సమ‌యంలో సౌర‌వ్ గంగూలీ ఒక స్టార్ ఆట‌గాడిగా ఉన్నాడు. షారుక్ ఖాన్ ఆధ్వ‌ర్యంలోని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం క‌లిగిగించ‌లేదు.. ఎందుకంటే అప్ప‌టికే టీమిండియా జ‌ట్టును విజ‌య‌వంతంగా నడిపిన సార‌ధిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. భార‌త్ క్రికెట్‌లో దూకుడైన ఆట‌తీరుతో పాటు కెప్టెన్‌గా సాహోసోపేత నిర్ణ‌యాలు తీసుకున్న గంగూలీ భార‌త అభిమానుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. అలాంటి గంగూలీ సొంత రాష్ట్ర‌మైన ప‌శ్చిమ బెంగాల్‌లో దాదా అని ముద్దుగా పిలుచుకునేవారు. భార‌త జ‌ట్టును విజ‌య‌వంతంగా న‌డిపిన దాదా  కేకేఆర్ కెప్టెన్‌గా జ‌ట్టుకు టైటిల్ సాధించిపెడ‌తాడని అభిమానులు భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు.. మొద‌టి సీజ‌న్‌లో మొద‌టి మ్యాచ్ మిన‌హా అన్ని మ్యాచ్‌లు విఫ‌ల‌మ‌వ‌డంతో లీగ్‌లో 6వ స్థానంలో నిలిచింది.

త‌ర్వాతి సీజ‌న్‌లో జ‌ట్టుకు కోచ్‌గా వ‌చ్చిన ఆస్ట్రేలియన్ కోచ్ జాన్ బుచాన‌న్ మల్టిప‌ల్ కెప్టెన్సీ అనే ప్ర‌తిపాద‌న తీసుకురావ‌డం,  గంగూలీ కెప్టెన్‌గా విఫ‌ల‌మ‌య్యాడంటూ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించడం చ‌క‌చకా జ‌రిగిపోయాయి. అయితే ఆ ఏడాది కేకేఆర్ ప్ర‌ద‌ర్శన మ‌రింత దిగ‌జారింది. లీగ్‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచి చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేసింది. దీంతో మూడో సీజ‌న్‌కు మ‌ళ్లీ గంగూలీనే కెప్టెన్‌గా ఎంపిక చేసిన కేకేఆర్ రాత మాత్రం మార‌లేదు. మూడో సీజ‌న్‌లో కేకేఆర్ 6వ స్థానంలో నిలిచింది. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీ గంగూలీ స్థానంలో గౌతం గంభీర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డంతో కోల్‌క‌తా ద‌శ తిరిగింది. గంభీర్ సార‌ధ్యంలో రెండు సార్లు టైటిల్ గెల‌వ‌డంతో పాటు నాలుగుసార్లు ఫ్లే ఆఫ్ ద‌శ‌కు చేరింది.(చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top