డబుల్‌ సెంచరీతో ఇరగదీశాడు..

Smith joined another elite list after slams double ton - Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 301 బంతుల్లో ద్విశతాకాన్ని సాధించి మరొకసారి సత్తా చాటాడు. 92 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన స్మిత్‌ విజృంభించి ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లకు అత్యంత పరీక్షగా నిలిచి మూడో సెషన్‌లో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా యాషెస్‌ సిరీస్‌లో అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించిన దిగ్గజ ఆటగాడు బాబ్‌ సింప్పన్‌ సరసన నిలిచాడు. యాషెస్‌లో ఇది స్మిత్‌కు రెండో డబుల్‌ సెంచరీ కాగా, సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌(8) తొలిస్థానంలో, వాల్టర్‌ హామ్మొండ్‌(4) రెండో స్థానంలో ఉన్నారు. గతంలో బాబ్‌ సింప్సన్‌ కూడా యాషెస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించాడు. కాగా, స్వదేశంలో జరిగిన యాషెస్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో నాన్‌ ఓపెనర్‌గా స్మిత్‌ గుర్తింపు పొందాడు. ఈ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌.

అంతకుముందు స్మిత్‌ 121 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఉండగా ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగుల్ని తన ఖాతాలో వేసుకన్నాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది కూడా స్మిత్‌ వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించినట్లయ్యింది. 2014-17 నుంచి చూస్తే స్మిత్‌ ప్రతీ ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని నమోదు చేశాడు. ఇక్కడ వరుస క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సార్లు వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో ఆసీస్‌ మాజీ ఆటగాడు మాథ్యు హేడెన్‌(5 వరుస సంవత్సరాలు) ముందు వరుసలో ఉన్నాడు. 2001 నుంచి 2005 వరుస సంవత్సరాల్లో హేడెన్‌ వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించాడు. ఆ తర్వాత స్మిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై బ్రియాన్‌ లారా(వెస్టిండీస్‌), కెవిన్‌ పీటర్సన్‌(ఇంగ్లండ్‌), ట్రెస్కోథిక్‌(ఇంగ్లండ్‌)లు ఉన్నారు. ఈ ముగ్గురూ మూడు వరుస సంవత్సరాల్లో మాత్రమే వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించారు. కాగా, ఈ ఏడాది వెయ్యి అంతకంటే టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో చతేశ్వర పుజారా(1140) తొలి స్థానంలో ఉండగా, డీన్‌ ఎల్గర్‌(1097) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్‌ కోహ్లి(1059) మూడో స్థానంలో, కరుణరత్నే(1031) నాల్గో స్థానంలో ఉన్నారు. ఆపై చండిమాల్‌(1003), స్టీవ్‌ స్మిత్‌(1001)లు ఉన్నారు.

మరొకవైపు స్మిత్‌ తాజా సెంచరీతో అతను 22వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అయితే ఇక్కడ హాఫ్‌ సెంచరీల కంటే స్మిత్‌ చేసిన టెస్టు సెంచరీలే ఎక్కువగా ఉండటం విశేషం. స్మిత్‌ తన కెరీర్‌లో 21 హాఫ్‌ సెంచరీలు సాధించగా, 22 సార్లు హాఫ్‌ సెంచరీలను సెంచరీలుగా మలుచుకున్నాడు. యాషెస్‌ మూడో టెస్టులో స్మిత్‌ చేసిన సెంచరీ అతనికి ఫాస్టెస్‌ సెంచరీగా నిలిచింది. ఈ టెస్టులో స్మిత్‌ సెంచరీ సాధించడానికి 138 బంతులు మాత్రమే తీసుకుని, 2015లో పెర్త్‌లో న్యూజిలాండ్‌పై 140  బంతుల్లో చేసిన సెంచరీని సవరించాడు. 92 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు తన ఇన్నింగ్స్‌ కొనసాగించిన స్మిత్‌ సెంచరీ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top