కంటతడి పెట్టినా లైవ్‌లో పరువు తీశారు

Shaming Teammate South Korean Olympic skaters face backlash - Sakshi

సియోల్‌ : దక్షిణ కొరియా స్కేటర్లపై అభిమానులు భగ్గుమంటున్నారు. సెమీ-ఫైనల్‌ క్వాలిఫైయింగ్‌ రేసులో ఓడిపోయి వింటర్‌ ఒలంపిక్స్‌ నుంచి టీమ్‌ నిష్క్రమించింది. అయితే వారు ఓటమి గురించి ఆటగాళ్లపై మండిపడటం లేదు. టీమ్‌ సభ్యురాలైన నో సెయాన్‌-యెయాంగ్‌పై మిగతా సభ్యులు లైవ్‌లోనే విమర్శలు చేసినందుకు...

సోమవారం 500 మీటర్ల క్వాలిఫైయింగ్‌ రేసులో కిమ్‌ బో-రెమ్‌ నేతృత్వంలో బృందం పాల్గొంది. అయితే రేసులో కిమ్‌, మరో ప్లేయర్‌ పార్క్‌ జీ-వూ లు దూసుకుపోగా.. నో సెయాన్ మాత్రం వెనకబడిపోయింది. చివరకు రేసులో సౌత్‌ కొరియా టీమ్‌ ఓటమి పాలైంది. దీనిని జీర్ణించుకోలేక నో సెయాన్‌ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే టీమ్‌ సభ్యులు మాత్రం ఆమెపై కనికరం చూపలేదు. కిమ్‌, పార్క్‌లు  ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ...  ‘మేం మా ఆట సరిగ్గానే ఆడాం. కానీ, నో సెయాన్‌ విఫలమైంది. చాలా చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఆమె మూలంగానే ఓటమి చెందాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై చూసిన దక్షిణ కొరియా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపొటములు సహజమని.. అంత మాత్రానికి తోటి క్రీడాకారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదని వారంటున్నారు.

అంతేకాదు కిమ్‌, పార్క్‌లను తక్షణమే నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్‌ను రూపొందించారు. దానిని అధ్యక్ష కార్యాలయ అధికారిక సైట్‌కు పొందుపరచగా... దీనిపై ఇప్పటిదాకా దాదాపు 2,50,000 మంది సంతకాలు చేశారు. అయితే వారిద్దరిపై నిషేధం విధించే అంశంపై మాత్రం దక్షిణ కొరియా క్రీడా శాఖ, ఒలంపిక్స్‌ కమిటీ స్పందించలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top