
షరపోవా..సెరెనా.. ఓ బాయ్ ఫ్రెండ్!
ఒకరు అగ్నిగోళం. ఒకరు మంచు కొండ. ఒకరంటే ఒకరికి పడదు. మైదానంలోకి దిగితే ఒకరు నిప్పులు కురిపిస్తారు. మరొకరు మంచు తుపాను రేపుతారు.
ఒకరు అగ్నిగోళం. ఒకరు మంచు కొండ. ఒకరంటే ఒకరికి పడదు. మైదానంలోకి దిగితే ఒకరిపై ఒకరు నిప్పులు కురిపిస్తారు. మరొకరు మంచు తుపాను రేపుతారు. అయినా ఆటలో ఎప్పుడూ అగ్ని గోళానిదే పైచేయి. వారే ప్రస్తుతం వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పరస్పరం తలపడుతున్న సెరెనా విలియమ్స్, మరియా షరపోవా.... షరపోవా నుంచి సెరెనా విలియమ్స్ ఆటను గెల్చుకోగా, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను షరపోవా గెలుచుకుంది. వీరు ఒక దశలో ఆటలో పోట్లాడుకున్నట్టే బహిరంగంగా బాయ్ ఫ్రెండ్ గురించి పోట్లాడుకున్నారు. ఆ బాయ్ ఫ్రెండే బల్గేరియా టెన్నిస్ యువ కిశోరం గ్రిగర్ దిమిత్రోవ్...ఆయన టెన్నిస్ ఆట ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్‌ను తలపింపచేస్తోంది. కనుక ఆయన అభిమానులు ఆయన్ని బేబీ ఫెడ్ అని కూడా పిలుస్తారు.
దిమిత్రోవ్ తనను విడిచి వెళ్లిన కొన్ని వారాలకు 2012, జూలైలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విలియమ్స్ ఆ బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు ‘నేను ఆయనతో డేటింగ్ వదిలేశాను. ఎందుకో అది నాకు అచ్చిరాలేదు. నాలో ఉద్వేగం పాలెక్కువ. నా గుండె తరుక్కుపోయింది. అందరు తప్పు చేసినట్టుగానే నేనూ తప్పుచేశాను. ఆ విషయాన్ని తలుచుకుంటే భరించలేను’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై షరపోవా స్పందిస్తూ ‘ఆమె... ఆమెకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు మాట్లాడదల్చుకుంటే, ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఎవరైతే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య నుంచి డైవోర్స్ తీసుకోబోతున్నారో ఆ బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రమే మాట్లాడాలి’ అని ఫెంచ్ టెన్నిస్ కోచ్ పాట్రిక్ మౌరతొగ్లౌను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. దిమిత్రోవ్ కూడా తొలుత పాట్రిక్ దగ్గరే శిక్షణ పొందాడు. అప్పటికే ఆయన వద్ద శిక్షణ పొందుతున్న విలియమ్స్‌తో అక్కడే ఆయనకు పరిచయమైంది. కొంతకాలం వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. అనంతరం దిమిత్రోవ్ మరో కోచ్‌వద్దకు మారిపోయాక షరపోవాతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం దిమిత్రోవ్‌తో షరపోవా ప్రేమాయణం సాగిస్తుంటే పాట్రిక్‌ను విలియమ్స్ పెళ్లి చేసుకోబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు 33 ఏళ్ల విలియమ్స్ ఇద్దరు ర్యాప్ సింగర్లతో ప్రేమాయణం సాగించగా, షరపోవా ఓ టెన్నిస్ ప్లేయర్, ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్, ఓ సినిమా నిర్మాతతో ప్రేమాయణం సాగించారు. వీరి ఇద్దరి ప్రేమాయణం ఈసారైనా పెళ్లిదాకా వెళుతుందా లేదా ? అన్నది వేచి చూడాలి.