డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట

Sathwik And Chirag Entered To Doubles Finals Of BWF French Open - Sakshi

సెమీస్‌లో ఐదో సీడ్‌ జపాన్‌ జోడీపై సంచలన విజయం

పారిస్‌ (ఫ్రాన్స్‌): ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ జంటను...క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్‌ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి సెమీఫైనల్లోనూ గొప్ప విజయం సాధించారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–11, 25–23తో ఐదో సీడ్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్‌) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జపాన్‌ జోడీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. నేడు జరిగే ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ గిడియోన్‌–కెవిన్‌ సుకముల్జో (ఇండోనేసియా) జోడీతో సాత్విక్‌–చిరాగ్‌ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–6తో వెనుకబడి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం పురుషుల డబుల్స్‌ ఫైనల్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత జరిగే అవకాశముంది. మ్యాచ్‌ స్టార్‌స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

వరుసగా 11 పాయింట్లు గెలిచి... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఇండోనేసియా ప్లేయర్‌ జొనాథన్‌ క్రిస్టీ అత్యద్భుత విజయం సాధించాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన సెమీఫైనల్లో 7–21, 22–20, 21–19తో గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణాయక చివరి గేమ్‌లో ఒకదశలో క్రిస్టీ 10–19తో వెనుకంజలో నిలిచి ఓటమి అంచుల్లో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విజృంభించిన క్రిస్టీ వరుసగా 11 పాయింట్లు సాధించి చివరి గేమ్‌ను 21–19తో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top