వారెవ్వా... సానియా | Sania Mirza-Martina Hingis Win Women's Doubles Title | Sakshi
Sakshi News home page

వారెవ్వా... సానియా

Jul 12 2015 2:13 AM | Updated on Oct 5 2018 9:09 PM

వారెవ్వా... సానియా - Sakshi

వారెవ్వా... సానియా

కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అనుకున్నది సాధించింది.

హింగిస్‌తో కలిసి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సొంతం
 లండన్: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అనుకున్నది సాధించింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ప్రతిష్టాత్మక వింబుల్డన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 5-7, 7-6 (7/4), 7-5తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) ద్వయంపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.
 
 విజేత సానియా జంటకు 3 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 3 కోట్ల 34 లక్షలు), రన్నరప్ మకరోవా-వెస్నినా జోడీకి లక్షా 70 వేల పౌండ్లు (రూ. కోటీ 67 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2003లో అలీసా క్లెబనోవా (రష్యా)తో కలిసి వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సానియా 12 ఏళ్ల తర్వాత హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను నెగ్గడం విశేషం. గతంలో సానియా నెగ్గిన మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. భారత్‌కే చెందిన మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012), బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి 2014లో యూఎస్ ఓపెన్ సాధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement