అమ్మ కానున్న సానియా

Sania Mirza to become mother in October: Father - Sakshi

స్వయంగా ప్రకటించిన భారత టెన్నిస్‌ స్టార్‌

న్యూఢిల్లీ: సానియా ఓ టెన్నిస్‌ స్టార్‌... ఇన్నాళ్లూ రాకెట్‌తో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆడిన ఆమె త్వరలో తన సంతానంతో ముద్దుగారే ఆటలాడేందుకు సిద్ధమవుతోంది. 31 ఏళ్ల ఈ హైదరాబాదీ స్టార్‌ ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అక్టోబర్‌లో ఆమె అమ్మతనాన్ని ఆస్వాదించనుంది. అక్టోబర్‌ నెలలో ప్రసవం అయ్యే అవకాశముందని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. సుదీర్ఘ కెరీర్‌లో టైటిళ్లతో, ర్యాంకులతో కుస్తీ పట్టిన ఆమె మోకాలు గాయంతో గత అక్టోబర్‌ నుంచి ఆటకు దూరంగా ఉంది. తీరిక దొరికిన ఆమె ఈ నెల 12న తన భర్త, పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో కలిసి 8వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.  

సోమవారం సానియా తాను గర్భవతినంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై ఓ వార్తా సంస్థ ప్రతినిధి ఆమె తండ్రి ఇమ్రాన్‌ మీర్జాను సంప్రదించగా... ఆ ట్వీట్‌ నిజమేనని ధ్రువీకరించారు. అక్టోబర్‌లో ప్రసవం జరిగే అవకాశముందని కూడా చెప్పారు. ఇటీవల ‘గోవా ఫెస్ట్‌’ సందర్భంగా ఆమె తనకు సంతానం కలిగితే వారి ఇంటి పేరులో ‘మీర్జామాలిక్‌’ జోడిస్తామని, ఇదే విషయాన్ని తన భర్త షోయబ్‌తోనూ చర్చించినట్లు చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో సానియా... వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ ద్వారా పునరాగమనం చేస్తానంది. తాజా పరిణామంతో ఇక ఈ ఏడాదంతా ఆమె టెన్నిస్‌కు దూరమైనట్లే!  

31 ఏళ్ల సానియా ఇప్పటివరకు సింగిల్స్‌ విభాగంలో ఒకటి... డబుల్స్‌ విభాగంలో 41 టైటిల్స్‌ సాధించింది. ఇందులో మహిళల డబుల్స్‌లో మూడు... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. సింగిల్స్‌లో 2007లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ 27కు చేరుకున్న సానియా... 2011 నుంచి డబుల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. 2015 ఏప్రిల్‌లో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. గతేడాది అక్టోబర్‌లో షుయె పెంగ్‌ (చైనా) భాగస్వామిగా బీజింగ్‌ ఓపెన్‌లో ఆడి సెమీఫైనల్‌ చేరింది. ఆ తర్వాత గాయం కారణంగా ఆమె మళ్లీ బరిలోకి దిగలేదు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top