పెళ్లి చేసుకోబోతున్న సైనా, కశ్యప్‌ | Saina Nehwal and Parupalli Kashyap love story began in Hyd academy | Sakshi
Sakshi News home page

పరిణయానికి సిద్ధం! 

Sep 27 2018 1:57 AM | Updated on Sep 27 2018 2:40 PM

Saina Nehwal and Parupalli Kashyap love story began in Hyd academy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లే సమయం వచ్చింది! బ్యాడ్మింటన్‌ స్నేహాన్ని భార్యాభర్తలా బంధంగా మార్చుకున్న జోడీల జాబితాలో మరో జంట చేరనుంది. హైదరాబాదీ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం. వీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం బ్యాడ్మింటన్‌ వర్గాల్లో చాలా కాలంగా అందరికీ తెలిసిన విషయమే. 2005లో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేరిన నాటినుంచి వీరి మధ్య బంధం కొనసాగుతోంది. గతంలో ప్రేమ, పెళ్లికి సంబంధించిన చర్చ ఎప్పుడూ వచ్చినా వీరిద్దరు దానిపై ఏనాడూ బయట పడలేదు. కేవలం స్నేహితులు, సహచర షట్లర్‌గానే వారు చెప్పుకున్నారు. అయితే తమ మధ్య ప్రేమ కొనసాగుతోందని అంగీకరించడం గానీ కొట్టి పారేయడం గానీ చేయలేదు. ఇప్పుడు మాత్రం మొదటిసారి పెళ్లికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా షట్లర్‌గా 28 ఏళ్ల సైనా గుర్తింపు పొందగా.... 32 ఏళ్ల కశ్యప్‌ 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. డిసెంబర్‌ 16న హైదరాబాద్‌లోనే పెళ్లి జరగవచ్చని తెలిసింది. 21న సైనా–కశ్యప్‌ భారీ స్థాయిలో రిసెప్షన్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.  

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు, పెద్ద సంఖ్యలో సూపర్‌ సిరీస్‌ టోర్నీ విజయాలతో పాటు సైనా వరల్డ్‌ నంబర్‌వన్‌ స్థాయికి చేరగా, కశ్యప్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా ఆరో ర్యాంక్‌ సాధించాడు. బీడబ్ల్యూఎఫ్‌ సర్క్యూట్‌లో సైనా ఇంకా చురుగ్గా ఉండగా... వరుస గాయాలతో కశ్యప్‌ కెరీర్‌ ఒడిదుడుకులకు లోనైంది. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన సమయంలో సైనా తొలిసారి తన విజయాల్లో కశ్యప్‌ పాత్ర కూడా ఉం దని చెప్పింది. టోర్నీ ఆసాంతం తనను ప్రోత్సహించిన విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి సోషల్‌ మీడియాలో తాము కలిసి ఉన్న ఫొటోలను వీరిద్దరు ఎక్కువగా పోస్ట్‌ చేస్తూ వచ్చారు. గతంలో పలువురు భారత షట్లర్లు సహచర ప్లేయర్లని వివాహమాడారు. గతంలో పుల్లెల గోపీచంద్‌–పీవీవీ లక్ష్మి,  సయ్యద్‌ మోడి–అమిత, మధుమిత బిస్త్‌–విక్రమ్‌ సింగ్‌; ప్రణవ్‌ చోప్రా–ప్రద్న్యా; అరుణ్‌ విష్ణు–అరుంధతి ఇలా పెళ్లి చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement