రన్నరప్‌ సాయిప్రణీత్‌  | Sai Praneeth was runner up in the badminton tournament | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాయిప్రణీత్‌ 

Mar 18 2019 1:06 AM | Updated on Mar 18 2019 1:06 AM

Sai Praneeth was runner up in the badminton tournament - Sakshi

చాలా రోజుల తర్వాత నా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో రెండో గేమ్‌లో కీలకదశలో రెండేసి పాయింట్ల చొప్పున కోల్పోవడం మలుపు తిప్పింది. సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌పై సాధించిన గెలుపు నా కెరీర్‌లోని గొప్ప విజయాల్లో ఒకటి. వచ్చే వారం భారత్‌లో జరిగే ఇండియా ఓపెన్‌లో టైటిల్‌ సాధించేందుకు కృషి చేస్తాను. 
–‘సాక్షి’తో సాయిప్రణీత్‌
 

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): దాదాపు రెండేళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ టైటిల్‌ కొరతను తీర్చుకోవాలని ఆశించిన భారత షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సాయిప్రణీత్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21–19, 18–21, 12–21తో టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2017లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత స్విస్‌ ఓపెన్‌ రూపంలో మరో అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌ చేరిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ తుది మెట్టుపై తడబడ్డాడు.

68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాయిప్రణీత్‌ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది. ఈ గేమ్‌లో పలుమార్లు స్కోరు సమంగా నిలిచింది. అయితే స్కోరు 18–18 వద్ద షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి జోరు పెంచగా, సాయిప్రణీత్‌ డీలా పడ్డాడు. విజేత షి యుకికి 11,250 డాలర్లు (రూ. 7 లక్షల 75 వేలు)... రన్నరప్‌ సాయిప్రణీత్‌కు 5,700 డాలర్లు (రూ. 3 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

►దాదాపు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన స్విస్‌ ఓపెన్‌లో గతంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్‌ (2015), ప్రణయ్‌ (2016), సమీర్‌ వర్మ (2018), సైనా (2011, 2012) టైటిల్స్‌ నెగ్గగా... భారత్‌ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి ప్లేయర్‌ సాయిప్రణీత్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement