
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత జూనియర్ ర్యాంకింగ్ అండర్–19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–జూపూడి సృష్టి జంట మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. చండీగఢ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో సాయికుమార్–సృష్టి ద్వయం 21–18, 21–16తో సాయిప్రతీక్ కృష్ణప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై విజయం సాధించింది. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు పాయింట్ల కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడినా కీలకదశలో సాయికుమార్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
అండర్–19 పురుషుల డబుల్స్ టైటిల్‌ను కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం గెల్చుకుంది. ఫైనల్లో కృష్ణప్రసాద్–ధ్రువ్ జోడీ 21–14, 21–14తో మంజిత్ సింగ్–డింకూ సింగ్ (మణిపూర్) జంటను ఓడించింది.