భారత్‌ శుభారంభం

Rupinder brace helps India beat New Zealand 4-2 in first hockey  - Sakshi

న్యూజిలాండ్‌పై 4–2తో విజయం 

మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–2తో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించింది. భారత్‌ తరఫున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (2వ, 34వ నిమిషంలో) రెండు గోల్స్‌తో ఆకట్టుకోగా... మన్‌దీప్‌ సింగ్‌ (15వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (38వ నిమిషంలో) చెరో గోల్‌ నమోదు చేశారు. ప్రత్యర్థి జట్టు తరఫున స్టీఫెన్‌ జెన్నెస్‌ (26వ, 55వ నిమిషంలో) రెండు గోల్స్‌ చేశాడు. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌ పాల్‌ సింగ్‌ గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు.

ఏడో నిమిషంలో ప్రత్యర్థికి గోల్‌ చేసే అవకాశం వచ్చినా దాన్ని భారత గోల్‌ కీపర్‌ కిృషన్‌ పాఠక్‌ అడ్డుకున్నాడు. 15వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని మన్‌దీప్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. అనంతరం న్యూజిలాండ్‌ స్ట్రయికర్‌ జెన్నెస్‌ గోల్‌తో ఆధిక్యం 2–1కి తగ్గినా... రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి తర్వాత వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను రూపిందర్, హర్మన్‌ప్రీత్‌ గోల్స్‌గా మలిచి 4–1తో భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. చివర్లో జెన్నెస్‌ మరో గోల్‌ చేసినా అది ఆధిక్యాన్ని తగ్గించడానికే పరిమితమైంది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ శనివారం జరుగనుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top