
రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్ (ఫైల్)
దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప హర్షం వెలిబుచ్చాడు.
కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో ఆడే భారత క్రికెట్ జట్టుకు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప హర్షం వెలిబుచ్చాడు. దినేశ్ ఎంపికను పూర్తిగా సమర్థిస్తూ అతడికి న్యాయం జరిగిందని వ్యాఖ్యానించాడు. వరల్డ్‌కప్ ఆడేందుకు అన్నివిధాలా దినేశ్ అర్హుడని కితాబిచ్చాడు. గత రెండేళ్లుగా అతడు స్థిరంగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు.
‘ఉత్తమ ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఈ వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది దినేశ్ కార్తీక్. అతడికి న్యాయం జరిగింది. గత రెండేళ్లుగా బెస్ట్ ఫినిషర్‌గా అతడు నిలబడ్డాడ’ని రాబిన్ ఊతప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను పక్కనపెట్టి దినేశ్ కార్తీను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.
గత మూడేళ్లలో స్వల్ప అవకాశాలు దక్కినా వాటిని సద్వినియోగం చేసుకున్నాడు దినేశ్ కార్తీక్. 2017 నుంచి 20 వన్డేలు ఆడి 46.75 సగటుతో 425 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా అతడిని నాలుగో స్థానంలో ఆడించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా దినేశ్ వ్యవహరిస్తున్నాడు.