పంత్‌ భళా.. అచ్చం ధోనిలానే!

Rishabh Does an MS Dhoni To Make Successful DRS call - Sakshi

లాడర్‌హిల్‌(అమెరికా): వెస్టిండీస్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్‌ యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేరిన రిషభ్‌.. రెండో టీ20లో 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వికెట్ల వెనుక కీపర్‌ పాత్ర పోషించే క్రమంలో రిషభ్‌ పంత్‌ చేసిన సూచన ఒకటి ఆకట్టుకుంది. తొలి టీ20లో పొలార్డ్‌ ఎల్బీ విషయంలో డీఆర్‌ఎస్‌కు వెళ్లడానికి కోహ్లి తటపటాయిస్తుంటే రిషభ్‌ పంత్‌ అది ఔటేనని రివ్యూ తీసుకుందామని తెలియజేశాడు. అంతే ఆ రివ్యూ సక్సెస్‌ కావడం, పొలార్డ్‌ పెవిలియన్‌కు చేరడం చకచకా జరిగిపోయాయి. దాంతో రిషభ్‌ను కోహ్లి చప్పట్లతో అభినందించాడు. మరొకవైపు అభిమానులు కూడా పంత్‌ డీఆర్‌ఎస్‌ విషయంలో సక్సెస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

‘ ఒక సాధారణ విద్యార్థికి తెలిసిన విషయాలు సైతం కొంతమంది తెలివైన విద్యార్థులకు తెలియాల్సిన అవసరం లేదు’ అని ఒక అభిమాని కొనియాడగా, ‘ తొలి టీ20లో ఏదో చెత్త షాట్‌ కొట్టి పంత్‌ ఔటైతే విమర్శలకు దిగుతారా.. ఇప్పుడు వారంతా ఎక్కడ. ఒక తెలివైన కీపర్‌గా పంత్‌ ఆకట్టకున్నాడు. డీఆర్‌ఎస్‌ విషయంలో ఎటువంటి తడబాటు లేకుండా కోహ్లికి రివ్యూకు వెళ్దామని సూచించాడు’ అని మరొక అభిమాని కొనియాడాడు. ‘ప్రస్తుత భారత క్రికెట్‌కు అతనే అత్యుత్తమ కీపర్‌. అతని వయసు 21. భవిష్యత్తు ఆశాకిరణం అతను’ అని మరొకరు పేర్కొన్నారు. ‘ బౌలర్‌ నవదీప్‌ సైనీ కూడా అది ఎల్బీ అని గుర్తించలేకపోయాడు. దాన్ని గుర్తించి కోహ్లికి తెలియజేసిన పంత్‌ నిజంగా అద్భతమే’ అని మరొక అభిమాని ప్రశంసించాడు. (ఇక్కడ చదవండి: కోహ్లిని దాటేశాడు..!)

వెస్టిండీస్‌ పర్యటనకు దూరంగా ఉన్న వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ స్థానంలో యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ధోని బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌తో పాటు మైదానంలో చురుకైన పాత్ర పోషిస్తాడు. ఫీల్డర్లను సెట్‌ చేయడం, బౌలర్లకు సూచనలు చేయడంతో పాటు కచ్చితమైన డీఆర్‌ఎస్‌ సమీక్షలపై అవగాహన కలిగి ఉంటాడు. ఈ విషయాల గురించి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పంత్‌.. ధోని స్థాయిలో ఆడాలని, అతడిలా కీపింగ్‌, బ్యాటింగ్‌ బాధ్యతలు చేపట్టాలని కెప్టెన్‌ కోహ్లి మ్యాచ్‌కు ముందు నిర్విహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top