
PC: BCCI/X
ఇది టీ20ల జమానా.. కో...డితే బంతి బౌండరీ దాటాల్సిందే.. పొట్టి ఫార్మాట్లో ఫోర్లు, సిక్సర్లు సులువుగానే కొట్టేయవచ్చు. కానీ టెస్టుల్లో సిక్స్ బాదడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సంప్రదాయ ఫార్మాట్లో ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా మాత్రమే సరిగ్గా షాట్‌ను కనెక్ట్ చేసి టెస్టుల్లో సిక్స్‌లు బాదగలరు. అప్పట్లో ఆడం గిల్‌క్రిస్ట్, వీరేందర్ సెహ్వాగ్, బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్ (Chris Gayle) అలవోకగా సిక్సర్లు కొడితే.. తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కూడా తమదైన షాట్లతో అలరించారు.
కాలానికి అనుగుణంగా పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతున్న వేళ ప్రస్తుతం డిఫెన్స్ షాట్లకు బదులు దూకుడుగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్ల సంఖ్య పెరుగుతోంది. టెస్టు క్రికెట్‌లో ప్రస్తుతం టీమిండియా యువ తరంగాలు రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ విధ్వంసకర షాట్లతో వీరూ, రోహిత్, ధోనిల సిక్సర్ల వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వీరికి పోటీనిస్తున్నాడు.
సెహ్వాగ్ రికార్డు సమం చేసిన పంత్
అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా సిక్సర్ల రికార్డులో పంత్ సెహ్వాగ్‌ను సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్.. రెండో టెస్టులో భారత్ గెలిచాయి.
ఇక కీలకమైన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినా టీమిండియాకు ఓటమే ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది.
గాయం వేధిస్తున్నా
అయితే, తొలి రోజు ఆటలో గాయపడిన పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి.. రెండో రోజైన గురువారం తిరిగి వచ్చి మరో 17 పరుగులు సాధించాడు. టీమిండియా మెరుగైన స్కోరు చేయడంలో పంత్ అర్ధ శతకం కూడా కీలకం.
మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్న పంత్.. 54 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్‌లో బాదిన సిక్సర్‌తో పంత్ సెహ్వాగ్ రికార్డును సమం చేయడం విశేషం. అయితే మ్యాచ్‌ల పరంగా చూస్తే సెహ్వాగ్ కంటే పంత్ ముందే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
Rishabh-Panti Max! 🔥😎
They tried to hit him where it hurts... Pant responds by hitting it out of the park!
Toughness has a new name @RishabhPant17 🙌🏻#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/6a2zPCQsr5— Star Sports (@StarSportsIndia) July 24, 2025
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్-10 క్రికెటర్లు వీరే
🏏1.రిషభ్ పంత్- 47 మ్యాచ్‌లలో కలిపి 90 సిక్సర్లు*
🏏2. వీరేందర్ సెహ్వాగ్- 103 మ్యాచ్‌లలో కలిపి 90 సిక్సర్లు
🏏3.రోహిత్ శర్మ- 67 మ్యాచ్‌లలో కలిపి 88 సిక్సర్లు
🏏4. మహేంద్ర సింగ్ ధోని- 90 మ్యాచ్‌లలో కలిపి 78 సిక్సర్లు
🏏5. రవీంద్ర జడేజా- 84 మ్యాచ్‌లలో కలిపి 74 సిక్సర్లు
🏏6. సచిన్ టెండుల్కర్- 200 మ్యాచ్‌లలో కలిపి 69 సిక్సర్లు
🏏7. కపిల్ దేవ్- 131 మ్యాచ్‌లలో కలిపి 61 సిక్సర్లు
🏏8. సౌరవ్ గంగూలీ- 113 మ్యాచ్‌లలో కలిపి 57 సిక్సర్లు
🏏9. శుబ్‌మన్ గిల్- 36 మ్యాచ్‌లలో కలిపి 43 సిక్సర్లు
🏏10. హర్భజన్ సింగ్- 103 మ్యాచ్‌లలో కలిపి 42 సిక్సర్లు.
👉కాగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 23 టెస్టుల్లోనే ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అతడు ఈ రికార్డు జాబితాలో టాప్-10లోకి చేరుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!?