
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. గాయపడినా జట్టు ప్రయోజనాల కోసం అతడు పోరాడిన తీరు అమోఘమని కొనియాడాడు. అయినా.. మరణాన్నే జయించిన వాడు ఇలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలకు తలవంచడంటూ ఆకాశానికెత్తాడు.
చావోరేవో
టెండుల్కర్- ఆండర్సర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలైంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు ఆటలో భాగంగా నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి
అయితే, మొదటి రోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా పంత్.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో పొరపడగా.. అది పంత్ కుడికాలి పాదాన్ని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్కానింగ్‌లో అతడి బొటనవేలు ఫ్యాక్చర్ అయిందనే వార్తలు వచ్చాయి.
హాఫ్ సెంచరీతో మెరిసి
ఈ నేపథ్యంలో పంత్ మళ్లీ తిరిగి బ్యాటింగ్‌కు రాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు రెండో రోజు మైదానంలో దిగాడు. కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అర్ధ శతకం (54) బాది పెవిలియన్ చేరాడు. తన పాత స్కోరుకు మరో పదిహేడు పరుగులు జత చేసి వెనుదిరిగాడు.
తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పంత్ పోరాటపటిమ, ఆట పట్ల అతడి అంకితభావం గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అనిల్ భాయ్‌ను గుర్తు చేశాడు
‘‘రిషభ్ పంత్ పట్టుదల గురించి తప్పక మాట్లాడాలి. అతడు నాకు అనిల్ (కుంబ్లే) భాయ్‌ను గుర్తు చేశాడు. ఆంటిగ్వాలో తన దవడ విరిగినా బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అప్పుడు అది అవసరం లేదు. కానీ ఆయన ఆ వికెట్ తీసి మరీ సత్తా చాటాడు.
ఇక ఇప్పుడు రిషభ్ పంత్.. కనీసం నడవలేకపోతున్నాడు. అయినా సరే మళ్లీ మైదానంలో దిగాడు. MRI స్కాన్, ఎక్స్-రే పూర్తయ్యాయి. అతడు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడనే వార్తలు వచ్చాయి.
మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?
ఈ ఒక్క మ్యాచ్ కాదు.. అతడు సిరీస్ మొత్తానికి దూరమవుతాడని అనుకున్నారంతా! కానీ అతడు తిరిగి వచ్చాడు. మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?.. ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు పంత్ లాంటి పోరాట యోధుడు తలవంచుతాడా?’’ అంటూ ఆకాశ్ చోప్రా పంత్‌ను ప్రశంసించాడు.
కాగా 2022, డిసెంబర్లో పంత్ పెను ప్రమాదం నుంచి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు నడుస్తాడా? లేదా? అన్న సందేహాల నడుమ.. రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా మునుపటి కంటే మెరుగ్గా ఆడుతూ అద్భుతాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టులో భారత బ్యాటర్లు ఫరవాలేదనిపించినా.. బౌలర్లు తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 46 ఓవర్లలో 225 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 133 పరుగులు మాత్రమే వెనుకబడి ఉండగా.. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి.
చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్
A knock for the ages! 💪#RishabhPant returned after being retired hurt and showed the world what true grit looks like.
How would you rate Rishabh Pant’s comeback knock? 👇#ENGvIND 👉 4th TEST, DAY 3 | FRI, 25th JUL, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/QsDlwZkIbc— Star Sports (@StarSportsIndia) July 24, 2025