
న్యూజిలాండ్ లెగ్ బ్రేక్ బౌలర్ ఐష్ సోధి అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 24) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సోధి.. అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (సోధితో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. సోధికి ముందు న్యూజిలాండ్‌కే చెందిన టిమ్ సౌథీ (164), ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ (161) ఈ మైలురాయిని తాకారు.
సౌథీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ 96 మ్యాచ్‌ల్లో 161, సోధి 126 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీశారు. సోధి ఈ ఘనత సాధించే క్రమంలో ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా వేయకపోవడం విశేషం.
భారత్ తరఫున టాప్‌లో అర్షదీప్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అర్షదీప్ 63 టీ20ల్లో 99 వికెట్లు తీశారు. అర్షదీప్ తర్వాత యుజ్వేంద్ర చహల్ (96), హార్దిక్ పాండ్యా (94) అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్లుగా ఉన్నారు.
జింబాబ్వేతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు.
అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్‌వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.
ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.