
PC: BCCI
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ మూడు పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావించే భారత్‌లో కోట్లాది మంది అభిమానులకు వీరు దేవుళ్లతో సమానం అంటే అతిశయోక్తి కాదు. తమదైన ఆటతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన వీరు.. సంపాదనలోనూ ముందే ఉన్నారు.
రెండు చేతులా సంపాదన
ఈ టీమిండియా దిగ్గజ త్రయం వెయ్యి కోట్లకు పైగా సంపాదన కలిగి ఉన్నారని అంచనా. క్రికెటర్లుగా బీసీసీఐ నుంచి పొందే ప్రయోజనాలతో పాటు.. తమ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు వీరు అంబాసిడర్లుగా ఉన్నారు. తద్వారా రెండు చేతులతో సంపాదిస్తున్నారు.
శతక శతకాల ధీరుడు సచిన్, మూడు ఐసీసీ ట్రోఫీల వీరుడు ధోని రిటైర్ అయినా.. సంపాదనలో మాత్రం ముందే ఉన్నారు. ఇక కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా సూపర్‌స్టార్ల సంపద గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అడిగిన ప్రశ్నకు.. భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
రూ. 100 కోట్లకు పైగానే
‘‘టీమిండియా సూపర్‌స్టార్ల సంపాదన ఏమేర ఉంటుంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వాన్.. రవిశాస్త్రిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్ల సంపాదన చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండార్స్‌మెంట్ల ద్వారా రూ. 100 కోట్లకు పైగానే సంపాదించి ఉంటారు.
నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!
అవును.. పది మిలియన్ల పౌండ్లు. నేనైతే వంద రూపాయలకు ఒక పౌండ్ చొప్పున ఇప్పుడు లెక్కకడుతున్నా. ఎంఎస్, విరాట్, సచిన్... 15- 20కి పైగా యాడ్లు చేస్తారు. రోజూ ఏదో వ్యాపకం ఉంటుంది. ఒక్కరోజు నటించే యాడ్‌తో కోట్లు సంపాదిస్తారు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. దీంతో నోరెళ్లబెట్టడం వాన్ వంతైంది. అతడితో పాటు అక్కడే ఉన్న అలిస్టర్ కుక్ కూడా ఆశ్చర్యపోయాడు.
ఎవరికి వారే సాటి
కాగా సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసి... ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డు బద్దలయ్యే ప్రసక్తే లేదని చెప్పవచ్చు. ఇక ధోని టీమిండియాకు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు.
మరోవైపు.. సూపర్‌స్టార్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటికి ఎనభై రెండు శతకాలు సాధించి.. సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా అధిగమించి.. అత్యధిక శతకాల వీరుడిగా కొనసాగుతున్నాడు. కాగా అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేలతో పాటు ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్ ప్రశంసలు