రవిశాస్త్రినే రైట్‌

Ravi Shastri reappointed head coach of Indian team - Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌గా మళ్లీ అతడికే పట్టం

ఏకగీవ్రంగా ఎంపిక చేసిన సీఏసీ

2021 టి20 ప్రపంచ కప్‌ వరకు బాధ్యతలు

రేసులో వెనుకబడిన హెసన్, మూడీ

ఓ ఎంపిక తంతు ముగిసింది...! టీమిండియా ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రికే అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌ సాధించలేకపోయినా... జట్టు కూర్పులో విమర్శలెదుర్కొన్నా... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అండదండలు సమృద్ధిగా ఉన్న అతడు... అందరినీ తోసిరాజంటూ మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. హెడ్‌కోచ్‌ ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో సమావేశమైన దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)... రవిశాస్త్రి నియామకానికి ఏకగీవ్రంగా అంగీకరించింది. కుదించిన జాబితాలో శాస్త్రి సహా మొత్తం ఆరుగురు ఉండగా, వీరిలో చివరి దశకు ముగ్గురే మిగిలారు. అందులోంచి అంతా అనుకుంటున్నట్లుగా... ముందే నిర్ణయించేసినట్లుగా... ‘రవి భాయ్‌’కే పట్టం కట్టారు.

ముంబై: పెద్దగా మలుపులేం లేవు. అనూహ్యమేమీ జరగలేదు. అంచనాలకు తగ్గట్లే, కెప్టెన్‌ కోహ్లి మనోగతానికి అనువుగానే అంతా సాగిపోయింది. భారత జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవి 2021 టి20 ప్రపంచకప్‌ వరకు పదిలమైంది. తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్‌ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు.

శుక్రవారం రోజంతా సమావేశమైన కపిల్‌ బృందం... వీరితోపాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ రాబిన్‌సింగ్, జట్టు మాజీ మేనేజర్‌ లాల్‌సింగ్‌ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేసింది. మరో దరఖాస్తుదారు ఫిల్‌ సిమన్స్‌ (వెస్టిండీస్‌) మాత్రం అంతకుముందే తప్పుకొన్నాడు. హెసన్, రాబిన్‌సింగ్, రాజ్‌పుత్‌ నేరుగా హాజరై తమ ప్రణాళికలు వివరించారు. మూడీ, ప్రస్తుతం భారత జట్టుతో కరీబియన్‌ దీవుల పర్యటనలో ఉన్న రవిశాస్త్రి టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రక్రియలో పాల్గొన్నారు. 2017 జులైలో శాస్త్రిని హెడ్‌ కోచ్‌గా అప్పటి సీఏసీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ ఎంపిక చేశారు. అప్పట్లో అతడి నియామకంపై వీరంతా కెప్టెన్‌గా కోహ్లి అభిప్రాయాన్ని తీసుకు న్నారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నామని కపిల్‌ తెలిపాడు.

డైరెక్టర్‌గా వచ్చి... కోచ్‌గా పాతుకుపోయాడు
2014 వరకు పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా ఉన్న రవి ఆ ఏడాది ఇంగ్లండ్‌లో భారత్‌ టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడటంతో వన్డే సిరీస్‌కు టీమ్‌ డైరెక్టర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో నియమితుడయ్యాడు. నాటి కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ ఉండగానే డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చూశాడు. ఫ్లెచర్‌ 2015 ప్రపంచ కప్‌ అనంతరం వైదొలిగాక, 2016 జూన్‌లో మేటి స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే కోచ్‌గా వచ్చేవరకు డైరెక్టర్‌ కమ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 2017 జూలైలో కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే తప్పుకోవడంతో ప్రధాన కోచ్‌ అయ్యాడు.

తాజా ఎంపికకు అతడి ఆధ్వర్యంలో జట్టు సాధించిన విజయాలు ఓ కారణంగా చెబుతున్నారు. శాస్త్రి హయాంలో భారత్‌ 2017–18 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్‌ నెగ్గింది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో లీగ్‌ దశలో టాప్‌లో నిలిచి సెమీస్‌ చేరింది. మధ్యలో ఆసియా కప్‌ వంటి చిన్నాచితక టోర్నీలు, స్వదేశంలో సిరీస్‌లు గెలుచుకుంది. ఇప్పుడు 2021 వరకు ఎంపిక చేసినందున బహుశా భారత క్రికెట్‌ చరిత్రలో ఎక్కువ కాలం కోచ్‌గా పనిచేసినవాడిగా రికార్డులకెక్కుతాడు.

కోహ్లి వ్యాఖ్యల ప్రభావం లేదు
‘కోచ్‌ ఎంపికలో మేం కోహ్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ అలానే చేసి ఉంటే... మిగతా జట్టు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకునేవారం. ఈ విషయంలో మేమెవరినీ సంప్రదించలేదు. అసలు అందుకు అవకాశమే లేదు. ప్రపంచ కప్‌ సాధించనంత మాత్రాన వేటు వేయాలని ఏమైనా ఉందా? మీరు మొత్తం విజయాలను చూడండి. వారి ప్రజంటేషన్‌నే మేం చూశాం. దాని ప్రకారమే వెళ్లాం. అందరూ నిపుణులే అయినా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ రవిశాస్త్రిని ముందంజలో నిలిపాయి’
– రవిశాస్త్రి ఎంపికపై కపిల్‌ స్పందన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top