వరల్డ్‌కప్‌ చరిత్రలోనే చెత్త రికార్డు | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ చరిత్రలోనే చెత్త రికార్డు

Published Tue, Jun 18 2019 6:49 PM

Rashid Khan Worst Figures By Any Bowler In World Cup History - Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అఫ్గానిస్తాన్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఒకడు. అయితే ఎవ్వరూ ఉహించని చెత్త రికార్డును రషీద్‌ ఖాన్‌ మూటగట్టుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. కనీసం వికెట్‌ కూడా తీయకుండా 9 ఓవర్లు వేసిన రషీద్‌ 110 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు. మరొకవైపు వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అఫ్గాన్‌ బౌలర్‌ చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో అఫ్గాన్‌ తరఫున నైబ్‌ 101 పరుగులు ఇస్తే, దాన్ని రషీద్‌ బ్రేక్‌ చేశాడు.  రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ 11 సిక్సర్లు సాధించడం ఇక్కడ గమనార్హం.(ఇక్కడ చదవండి: మోర్గాన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌)

ప్రధానంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో శతకం బాదేశాడు.  అయితే 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. బెయిర్‌ స్టో రెండో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మోర్గాన్‌ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్‌.. దాన్ని సెంచరీగా మలుచుకోవడానికి మరో 21 బంతుల్నే తీసుకున్నాడు.(ఇక్కడ చదవండి: మోర్గాన్‌ సిక్సర్ల రికార్డు)

మోర్గాన్‌ సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, సెంచరీనే కూడా సిక్స్‌తోనే సాధించడం ఇక్కడ విశేషం. ఇది నాల్గో ఫాస్టెస్ట్‌ వరల్డ్‌కప్‌ సెంచరీగా రికార్డులకెక్కింది.  ఈ క్రమంలోనే ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లోఅత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు.  గతంలో వరల్డ్‌కప్‌లో గేల్‌ 16 సిక్సర్లు కొట్టగా, దాన్ని మోర్గాన్‌ బ్రేక్‌ చేశాడు.  మోర్గాన్‌ భారీ సెంచరీకి జతగా బెయిర్‌ స్టో(90), జోరూట్‌(88)లు హాఫ్‌ సెంచరీలు జత చేశారు. చివర్లో మొయిన్‌ అలీ(31 నాటౌట్‌; 9 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement