ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తర్వాతే..

Rangana Herath to retire after first Test against England - Sakshi

గాలె: టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ బౌలర్‌గా తన పేరిట రికార్డు లిఖించుకున్న శ్రీలంక స్పిన్నర్‌ రంగనా హెరాత్‌ టెస్టు కెరీర్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడు. వచ్చే నెల్లో ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టెస్టు మ్యాచే హెరాత్‌కు చివరది. ఈ మేరకు గతంలోనే సూత్రప్రాయంగా సంకేతాలిచ్చిన హెరాత్‌.. తాజాగా తన వీడ్కోలు విషయాన్నివెల్లడించాడు. నవంబర్‌ 6 వ తేదీ నుంచి గాలెలో శ్రీలంక-ఇంగ్లండ్‌ జట్ల తొలి టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

అయితే గాలె వేదికను సెంటిమెంట్‌గా భావిస్తున్న హెరాత్‌.. ఇక్కడే వీడ్కోలు చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో తన టెస్టు కెరీర్‌ ముగింపుపై ప్రకటన చేశాడు. 1999లో గాలెలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హెరాత్‌.. కెరీర్‌ ముగింపు కూడా ఇదే వేదికపై పలకడానికి సిద్ధమయ్యాడు.

శ్రీలంక తరుపున 92 టెస్టుల్లో 430 వికెట్లు, 71వన్డేల్లో74 వికెట్లు, 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ బౌలర్‌గా హెరాత్‌ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాక్‌ దిగ్గజ బౌలర్‌ వసీం ఆక్రమ్‌ (414) ఉన్నాడు.  ముత్తయ్య మురళీధరన్‌ తర్వాత శ్రీలంక తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా హెరాత్‌ గుర్తింపు సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top