బుల్లేట్‌ దిగింది | Rahi Sarnobat strikes gold in 25m pistol event | Sakshi
Sakshi News home page

బుల్లేట్‌ దిగింది

Aug 23 2018 12:44 AM | Updated on Aug 23 2018 12:44 AM

 Rahi Sarnobat strikes gold in 25m pistol event - Sakshi

ఆసియా క్రీడల్లో భారత బుల్లెట్‌ మరోసారి లక్ష్యంలోకి దిగింది. ఈసారీ స్వర్ణాన్ని కొల్లగొట్టింది. అభిమానులందరినీ సంబరంలో ముంచెత్తింది. మంగళవారం 16 ఏళ్ల సౌరభ్‌ చౌధరీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఆఖరి రెండు షాట్‌లలో స్వర్ణాన్ని సొంతం చేసుకోగా... బుధవారం 27 ఏళ్ల రాహీ సర్నోబాత్‌ 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో రెండు ‘షూట్‌ ఆఫ్‌’లలో పసిడి పతకాన్ని ఖాయం చేసుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించాక ఫామ్‌ కోల్పోవడం... 2016లో మోచేతి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరం కావడం... ఇటీవల 16 ఏళ్ల మనూ భాకర్‌ పతకాల పంట పండిస్తుండటం... ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన రాహీ ఒకే ఒక్క ప్రదర్శనతో చరిత్రకెక్కింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఘనత వహించింది. మరోవైపు వుషు క్రీడాంశంలో నలుగురు భారత క్రీడాకారులు సెమీస్‌లో ఓడిపోవడంతో నాలుగు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, నాలుగు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్‌ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో ఏడో స్థానంలో ఉంది.   

పాలెంబాంగ్‌: చివరి షాట్‌ వరకు ఉత్కంఠ రేపిన ఫైనల్లో భారత షూటర్‌ రాహీ సర్నోబాత్‌ పైచేయి సాధించింది. తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన రాహీ సర్నోబాత్‌ విజేతగా నిలిచి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా, ఓవరాల్‌గా ఆరో షూటర్‌గా గుర్తింపు పొందింది.  

షూట్‌ ఆఫ్‌లో సూపర్‌... 
మొత్తం ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో ఐదు షాట్‌లతో కూడిన 10 సిరీస్‌లు ముగిశాక రాహీ, నఫాస్వన్‌ యాంగ్‌పైబూన్‌ (థాయ్‌లాండ్‌) 34 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ అవకాశం ఇచ్చారు. ఇందులో ఇద్దరూ నాలుగేసి పాయింట్లు చేయడం... స్కోరు సమం కావడంతో... మరో ‘షూట్‌ ఆఫ్‌’ అనివార్యమైంది. ఈసారి రాహీ 3 పాయింట్లు స్కోరు చేయగా... నఫాస్వన్‌ 2 పాయింట్లే సాధించడంతో భారత షూటర్‌కు స్వర్ణం లభించింది. నఫాస్వన్‌ ఖాతాలో రజతం చేరింది. 29 పాయింట్లతో కిమ్‌ మిన్‌జుంగ్‌ (దక్షిణ కొరియా) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత యువ సంచలనం, 16 ఏళ్ల మనూ భాకర్‌కు నిరాశ ఎదురైంది. ఆమె 16 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 32 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో మనూ 593 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని పొందగా... రాహీ సర్నోబాత్‌ 580 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో భారత షూటర్లు అంజుమ్, గాయత్రి  ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. స్వర్ణం నెగ్గిన రాహీకి రూ. 50 లక్షల నగదు పురస్కారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం నెగ్గిన తర్వాత రాహీకి రాష్ట్ర ప్రభుత్వం పుణేలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. 

షూటింగే నా జీవితం. పది నెలల క్రితం వ్యక్తిగత కోచ్‌గా వచ్చిన ముంక్‌బాయెర్‌ డార్జ్‌సురేన్‌ నా టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఫలితాన్ని ఇచ్చాయి. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతాను. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌. వచ్చే నెలలో కొరియాలోని చాంగ్‌వన్‌లో ఈ మెగా ఈవెంట్‌ మొదలవుతుంది. 2013లో ఇదే వేదికపై ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచాను.  ఈసారీ ఆ వేదిక నాకు కలిసొస్తుందని ఆశిస్తున్నాను.
–రాహీ సర్నోబాత్‌ 

నలుగురికీ కాంస్యాలే... 
వుషు క్రీడాంశంలో భారత్‌కు నాలుగు కాంస్యాలు లభించాయి. ఈ క్రీడల చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. పురుషుల ‘సాండా’ ఈవెంట్‌లో బరిలోకి దిగిన నరేందర్‌ గ్రెవాల్‌ (65 కేజీలు)... సంతోష్‌ కుమార్‌ (56 కేజీలు)... సూర్యభాను ప్రతాప్‌ సింగ్‌ (60 కేజీలు)... మహిళల ‘సాండా’ ఈవెంట్‌లో రోషిబినా దేవి (60 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్‌లో నరేందర్‌ 0–2తో ఫరూద్‌ జఫారీ (ఇరాన్‌) చేతిలో, సంతోష్‌ 0–2తో ట్రువోంగ్‌ గియాంగ్‌ (వియత్నాం) చేతిలో, సూర్యభాను 0–2తో ఇర్ఫాన్‌ (ఇరాన్‌) చేతిలో, రోషిబినా 0–1తో కాయ్‌ యింగ్‌యింగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement