
అశ్విన్.. ధోని గుర్తు లేడా?
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్పై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది.
న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్పై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అశ్విన్ గెలుచుకోవడం గర్వకారణమే అయినా, ఆ తరువాత అతను చేసిన ట్వీట్ మాత్రం టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఆ అవార్డును గెలుచుకోవడానికి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, ఫిట్నెస్ కోచ్ శంకర్ బసూ, భార్య ప్రీతిలే కారణమంటూ అశ్విన్ ట్వీట్ చేయడం ధోని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. విదేశాల్లో అశ్విన్ పేలవమైన ఫామ్లో ఉన్నప్పుడు అతనికి మద్దతుగా నిలిచిన ధోని ఇప్పుడు ఏమయ్యాడంటూ పలువురు ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.
'నీకు కఠినమైన పరీక్ష ఎదురైనప్పుడు అండగా నిలిచిన ధోని భాయ్ని మరిచిపోయావా?అని ఒక అభిమాని ప్రశ్నించగా, అసలు ధోని గురించి ఏమి మాట్లాడలేదే?'అని మరో అభిమాని ప్రశ్నించాడు. కాగా, తాను అశ్విన్ అభిమానినంటూ పేర్కొన్న ఒక యువకుడు మాత్రం తీవ్రంగా తప్పుబట్టాడు. ఇలా అండగా నిలిచి కెరీర్కు అభివృద్ధికి ఎంతగానో సాయపడిన ధోనిని మరిచిపోవడం క్షమించరానిదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ధోని నేతృత్వంలో అంచెలంచెలుగా ఎదిగిన అశ్విన్.. ఇప్పుడు కోహ్లి సారథ్యంలో ఫలితాల్ని సాధిస్తున్నాడనే విషయం అతను గ్రహిస్తే బాగుంటుందని మరొక అభిమాని నిలదీశాడు. ఇక్కడ కచ్చితంగా ధోనికి ధన్యవాదాలు తెలపాలంటూ అశ్విన్ కు హితబోధ చేశాడు.