భారత స్టార్ల శుభారంభం

PV Sindhu Saina Nehwal into 2nd Round after Easy Wins - Sakshi

ప్రిక్వార్టర్స్‌కు సింధు, సైనా 

శ్రీకాంత్, ప్రణయ్, కశ్యప్‌ కూడా 

సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ 

సింగపూర్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ సింగపూర్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్లంతా శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో  శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్, సమీర్‌ వర్మ ప్రిక్వార్టర్స్‌ చేరారు. అయితే భమిడిపాటి సాయిప్రణీత్‌... టాప్‌ సీడ్‌ కెంటో మొమొటా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లోనూ భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.  

సింధు 27 నిమిషాల్లోనే... 
మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో సింధు సునాయాస విజయం సాధించింది. సింధు 21–9, 21–7తో ఇండోనేసియాకు చెందిన లియాని అలెసండ్ర మయినకిని చిత్తుగా ఓడించింది. కేవలం 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. మరో మ్యాచ్‌లో సైనా 21–16, 21–11తో యులియా యుసెఫిన్‌ సుశాంటో (ఇండోనేసియా)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–17, 21–18తో సితికోమ్‌ తమసిన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 11–21, 21–16, 21–18తో ఫ్రాన్స్‌కు చెందిన బ్రైస్‌ లెవెర్డెజ్‌పై గెలుపొందగా, సమీర్‌ వర్మ 21–14, 21–6తో సుపన్యు అవిహింగ్సనన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గాడు. క్వాలిఫయింగ్‌ ద్వారా మెయిన్‌ డ్రాకు చేరిన పారుపల్లి కశ్యప్‌ 21–19, 21–14తో రస్ముస్‌ గెమ్కే (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు.  

పోరాడి ఓడిన సాయిప్రణీత్‌ 
భారత సహచరులంతా ముందంజ వేయగా సాయిప్రణీత్‌ ఆట తొలిరౌండ్లోనే ముగిసింది.  అతను 21–19, 14–21, 20–22తో మొమొటా చేతిలో పోరాడి ఓడాడు. 

సిక్కి జోడీ గెలిచింది 
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 21–18, 21–7తో భారత్‌కే చెందిన మనీష–అర్జున్‌ జోడీపై గెలుపొందింది. సౌరభ్‌ శర్మ–అనుష్క పారిఖ్‌ జోడీ 12–21, 12–21తో డెచపొల్‌ పువరనుక్రొ–తెరతనచయ్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్‌ రెడ్డి ద్వయం 13–21, 17–21తో డానీ క్రిస్నంటా– కియన్‌ హీన్‌ (సింగపూర్‌) జంట చేతిలో ఓటమి చవిచూసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top