ఫోర్బ్స్‌ జాబితాలో సింధుకు చోటు

PV Sindhu Is Placed In Forbes Top 10 Female Athletes List - Sakshi

న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రైజ్‌మనీతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా ప్రకటించింది. అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకోగా, పీవీ సింధు ఏడో స్థానంలో నిలిచారు. అయితే ఇలాంటి జాబితాల్లో భారత్‌ నుంచి టాప్‌-10లో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్‌ సింధునే కావడం గమనార్హం. 

నోకియా, పానసోనిక్‌, బ్రిడ్జిస్టోన్‌, గటోరేడ్‌, రెక్కిట్‌ బెంకిసెర్‌తో పాటు మరికొన్ని టాప్‌ బ్రాండ్‌లతో సింధుకు వాణిజ్య ఒప్పందాలున్నాయని ఫోర్బ్స్‌ ప్రకటనలో వివరించింది. గత రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన భారత క్రీడాకారణి సింధు.. కామన్వెల్త్‌ గేమ్స్‌-2018తో పాటు బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లలో 2017, 2018లలో ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. 

టాప్‌ 10 జాబితాలో ఇద్దరు మినహా ఇతర క్రీడాకారిణులు టెన్నిస్‌ ప్లేయర్లే. సింధు, ఫార్ములావన్‌ రేస్‌ డ్రైవర్‌ డానికా పాట్రిక్‌లు మాత్రమే నాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణులు కావడం విశేషం. తల్లి అయిన తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టిన అమెరికా స్టార్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ ఫోర్బ్స్‌ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. 

క్రీడాకారిణులు.. వారి ఆదాయం (ప్రైజ్‌ మనీ, వ్యాపార ఒప్పందాలు)

1. సెరెనా విలియమ్స్‌ - 18.1 మిలియన్ల డాలర్లు
2. కరోలిన్‌ వోజ్నియాకి - 13 మిలియన్ల డాలర్లు
3. స్లోనే స్టిఫెన్స్‌ - 11.2 మిలియన్ల డాలర్లు
4. గార్బైన్‌ ముగురుజా - 11 మిలియన్ల డాలర్లు
5. మరియా షరపోవా - 10.5 మిలియన్ల డాలర్లు
6. వీనస్‌ విలియమ్స్‌ - 10.2 మిలియన్ల డాలర్లు
7. పీవీ సింధు - 8.5 మిలియన్ల డాలర్లు
8. సిమోనా హలెప్‌ - 7.7 మిలియన్ల డాలర్లు
9. డానికా పాట్రిక్‌ - 7.5 మిలియన్ల డాలర్లు
10. ఎంజెలిక్‌ కెర్బర్‌ -  - 7 మిలియన్ల డాలర్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top