టైటిల్‌కు విజయం దూరంలో...

PV Sindhu makes final of Thailand Open, Okuhara awaits - Sakshi

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధు

నేడు ప్రపంచ చాంపియన్‌ ఒకుహారాతో ‘ఢీ’

 ఫైనల్స్‌ నేటి ఉదయం గం. 11.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

బ్యాంకాక్‌: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విజయం దూరంలో ఉంది. గత ఫిబ్రవరిలో ఇండియా ఓపెన్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ తెలుగు తేజం... థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 23–21, 16–21, 21–9తో గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. గంటపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేముల్లో తీవ్ర ప్రతిఘటన ఎదు ర్కొన్న సింధు... నిర్ణాయక మూడో గేమ్‌లో చెలరేగి తన ప్రత్యర్థి ఆట కట్టించింది.

ఆదివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి పోరులో ఇద్దరూ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఒకుహారాతో తలపడిన సింధు మూడు గేముల్లో నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లోనూ సింధు అలాంటి ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదో వేచి చూడాలి. ఈ సంవత్సరం ఐదు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన సింధు ఇండియా ఓపెన్‌లో మాత్రం ఫైనల్‌కు చేరింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గిన ఆమె... ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top