సింధు సగర్వంగా...

 PV Sindhu beats Chen Yufei to enter final - Sakshi

 అజేయంగా ఫైనల్లోకి

సెమీస్‌లో చెన్‌ యుఫెపై ఘన విజయం

నేటి టైటిల్‌ పోరులో యామగుచితో ‘ఢీ’

ప్రత్యర్థితో గట్టి పోటీ ఎదురైనా... అలసట తన కదలికలపై ప్రభావం చూపిస్తున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన పీవీ సింధు అనుకున్న ఫలితాన్ని సాధించింది. మధ్యలో రిఫరీ హెచ్చరికలు ఇబ్బంది పెట్టినా... అశేష అభిమానుల అండ, కోచ్‌ గోపీచంద్‌ ప్రోత్సాహం ఈ తెలుగు అమ్మాయిని మరింత ముందుకు దూసుకుపోయేలా చేశాయి. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన ఆమె తొలిసారి వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా మహిళల సింగిల్స్‌లో ఒకే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్, బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌ తుది పోరుకు అర్హత సాధించిన మూడో షట్లర్‌గా నిలిచింది. అరుదైన ఘనత సాధించేందుకు మరో విజయం దూరంలో ఉన్న సింధు నేడు జరిగే అంతిమ సమరంలో అకానె యామగుచితో తలపడుతుంది.   

దుబాయ్‌ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి  : సూపర్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు తన అద్భుతమైన ఆటతో 2017కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–15, 21–18 స్కోరుతో చెన్‌ యుఫె (చైనా)ను చిత్తు చేసింది. 59 నిమిషాలపాటు ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్‌ కోసం ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. ఫలితంగా సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. చివరకు సింధుదే పైచేయి అయింది.   గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా సింధు దూకుడుగా ఆటను ప్రారం భించింది. ప్రత్యర్థి పొరపాట్లు కూడా కలిసి రావడంతో 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ దశలో కోలు కున్న యుఫె చెలరేగింది. ఆమె కూడా ఐదు పాయింట్లు కొల్లగొట్టి స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత కూడా వరుసగా స్మాష్‌లతో చెలరేగి ఒక దశలో ప్రత్యర్థి 8–6తో ఆధిక్యంలో నిలిచింది. అయితే యుఫె తప్పులతో మళ్లీ 9–8తో ముందంజ వేసిన సింధు, అదే ఆధిక్యాన్ని 15–11 వరకు కొనసాగించింది. స్కోరు 16–14 వద్ద ఉన్నప్పుడు సింధు కొట్టిన అద్భుతమైన స్మాష్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వరుసగా మూడు సార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టిన యుఫె, సింధు రిటర్న్‌ను అందుకోలేక గేమ్‌ను అప్పగించింది.  

హోరాహోరీ.. 
రెండో గేమ్‌ మాత్రం పోటాపోటీగా సాగింది. ఈసారి యుఫె మెరుగ్గా ఆడటంతో సింధు శ్రమించక తప్పలేదు. అయితే ఏ దశలోనూ ప్రత్యర్థి తనను దాటిపోయే అవకాశం మాత్రం సింధు ఇవ్వలేదు. 6–3, 7–3, 9–4, 10–7... ఇలా సింధు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థికి పొరపాటున పాయింట్‌ ఇచ్చినా, ఆ వెంటనే కోలుకోగలిగింది. చూడచక్కటి ఆటతో అలరించిన సింధు మధ్యలో తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. పాయింట్లు సాధించాలనే పట్టుదలతో వరుసగా రెండు సార్లు అంపైర్‌ నిర్ణయాన్ని ఛాలెంజ్‌ చేసి రెండు సార్లూ ప్రతికూల ఫలితాన్ని పొందింది. అద్భుతమైన ర్యాలీ తర్వాత స్కోరు 15–15తో సమమైంది. సింధు అలసిపోవడాన్ని గుర్తించిన  యుఫె వరుస స్మాష్‌లతో దాడి చేసింది. అయితే 16–16 వద్ద సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి దూసుకుపోయింది. ర్యాలీ సుదీర్ఘ సమయం పాటు సాగడంతో ఒక దశలో సింధు నిస్సత్తువగా కనిపించి గేమ్‌ కోల్పోతుందేమో అనిపించింది. అయితే ఆమె పట్టుదలగా నిలబడగా, యుఫె రెండు స్మాష్‌లు నెట్‌కు తగలడంతో గెలుపు సింధు వశమైంది. మరో సెమీఫైనల్లో యామగుచి 17–21, 21–12, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. 

మొత్తానికి ఫైనల్‌ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు బాగా మద్దతిచ్చారు. ముఖ్యంగా స్టేడియానికి వచ్చిన తెలుగువారంతా చప్పట్లతో నన్ను ప్రోత్సహించారు. ఆదివారం జరిగే ఫైనల్‌పై దృష్టిపెట్టాను. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతాను. యామగుచిపై విజయాల పైచేయి ఉన్నప్పటికీ... ఆమె అంత సులువైన ప్రత్యర్థి కాదు. హోరాహోరీ తప్పదు.  
  – ‘సాక్షి’తో సింధు 

ఇది క్లిష్టమైన మ్యాచ్‌. ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. రెండో గేమ్‌లో ఒక దశలో సింధు తీవ్రంగా అలసిపోయింది. జలుబుతో ఇబ్బంది పడింది. కానీ ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టు సడలించలేదు. నిజానికి ఈ టోర్నీలో సింధు అద్భుతంగా ఆడుతోంది. ఫైనల్‌ చేరడం ఆనందంగా ఉంది. టైటిల్‌ పోరులో నిలిచిన యామగుచిపై ఇప్పటిదాకా సింధుదే  ఆధిపత్యమైనప్పటికీ ఫైనల్‌... ఫైనలే! అక్కడ ఎవరినీ అంతా తేలిగ్గా తీసుకోలేం.    
– ‘సాక్షి’తో కోచ్‌ గోపీచంద్‌  

నేటి ఫైనల్‌ సింధు(vs)యామగుచి   మధ్యాహ్నం గం. 3.00 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–2లో  ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top