పుజారా అజేయ శతకం

Pujara heroics Saurashtra to Ranji Trophy final - Sakshi

బెంగళూరు: రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది.  కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత పొందింది. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్‌ పుజారా(131 నాటౌట్‌; 266 బంతుల్లో 17 ఫోర్లు) అజేయంగా శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా షెల్డాన్‌ జాక్సన్‌(100 ; 217 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీ సాధించడంతో సౌరాష్ట్ర ఘన విజయం నమోదు చేసింది. 224/3 ఓ‍వర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర.. మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

కర్ణాటక విసిరిన 279 పరుగుల లక్ష్య ఛేదనలో సౌరాష్ట్రకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో పుజారా-జాక్సన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.  ఈ జోడి నాల్గో వికెట్‌కు 214 పరుగులు జోడించిన తర్వాత జాక్సన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత పుజారా మరింత బాధ్యతాయుతంగా ఆడటంతో సౌరాష్ట్ర ఐదో రోజు ఆట తొలి సెషన్‌లోనే విజయాన్ని అందుకుంది. ఫలితంగా రంజీ ట్రోఫీలో మూడోసారి ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ‍్రవరి 3వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది.

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ 275 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 239 ఆలౌట్‌

సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ 236 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 279/5

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top