
హంబన్‌టోటా: రెండో రోజూ బ్యాట్స్‌మెన్ కదంతొక్కడంతో... శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతోన్న నాలుగు రోజుల రెండో యూత్ టెస్టులో భారత అండర్–19 జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. పవన్ షా (332 బంతుల్లో 282; 33 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అంతర్జాతీయ అండర్–19 మ్యాచ్‌ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. దీంతో భారత్ 128.5 ఓవర్లలో 613/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 428/4తో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ పవన్ షా దూకుడుకు తోడు నేహల్ వధేర (64; 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారీ స్కోరు చేయగలిగింది.
వీరిద్దరు ఐదో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. లంక సీమర్ విచిత్ర పెరీరా వేసిన ఇన్నింగ్స్ 108వ ఓవర్‌లో పవన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. ట్రిపుల్ సెంచరీకి సమీపంలో పవన్ ఔటవడంతో భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (18 బంతుల్లో 14; 2 ఫోర్లు) రనౌటయ్యాడు.